Mon Dec 23 2024 08:01:47 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
స్వామి వారికి హుండీ ఆదాయం 3.92 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. సెలవులు ముగుస్తూ ఉండడంతో రద్దీ కొనసాగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. శని, ఆదివారాలు కావడంతో భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తుతూ ఉన్నారు. శుక్రవారం శ్రీవారిని 72,299 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.92 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 36,378 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుపతి చుట్టుపక్కల అందాలను ఆకాశం నుంచి తిలకించేందుకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘ఏరో డాన్’ అనే సంస్థ తీసుకు వచ్చిన జాయ్ రైడ్‌ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానంద రెడ్డితో కలసి హెలికాప్టర్ ఎక్కి చంద్రగిరి కోట వరకు వెళ్లి వచ్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి పోలీస్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే జాయ్ రైడ్ వల్ల తిరుపతి, చంద్రగిరి చుట్టు ప్రక్కల ప్రదేశాలను విహంగ వీక్షణం చేయొచ్చని, నాలుగు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తారని వెల్లడించారు. ఆరు సీట్ల కెపాసిటీ వున్న హెలికాప్టర్లో పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు ఎక్కేందుకు అవకాశముందన్నారు. ఏరోడాన్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి చంద్రగిరి పోర్టు వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తామని, ఈ రైడ్ కేవలం 8 నిమిషాల్లోనే పూర్తవుతుందని, ఒక గంటకు ఆరు రైడ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.6 వేలు వసూలు చేస్తున్నట్లు వివరించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే వేలాది మంది భక్తులతో పాటు తిరుపతి వాసులకు చుట్టు పక్కల అందాలను ఆకాశం నుంచి చూపించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ రైడ్ ప్రారంభిస్తున్నట్లు ఏరో డాన్ ప్రతినిధులు చెప్పారు.
Next Story