Fri Jan 10 2025 08:29:01 GMT+0000 (Coordinated Universal Time)
వైకుంఠ ఏకాదశికి దేవాలయానికి పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు దేవాలయాలకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
వైకుంఠ ఏకాదశికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు దేవాలయాలకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తిరుమలతో పాటు యాదగిరి గుట్ట, భద్రాచలం, ద్వారకా తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చారు. దీంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తిరుమలకుకూడా పెద్ద సంఖ్యలో నేడు వైకుంఠ ఏకాదశికి భక్తులు ఊహించిన విధంగానే రావడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది వీఐపీలు నేడు తిరుమలకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో గోవింద నామ స్మరణలతో మారు మోగిపోతుంది. ఉదయం 4.30 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి.
తొలుత వీఐపీలకు...
తొలుత తిరుమలలో వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. సామాన్య భక్తులను తర్వాత అనుమతించారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు కొలుసు పార్ధసారధి, సవిత, అనిత, సంథ్యారాణి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వంటి వారు వచ్చి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ తదితులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో క్యూ లైన్లు బారులు తీరాయి. అనేక దేవాలయాల్లో భక్తులు వచ్చి స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటున్నారు.
Next Story