Mon Dec 23 2024 07:18:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరొస్తున్నారో తెలుసా?
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. జమ్మూకశ్మీర్‌కి చెందిన ఆయన నియామకాన్ని ప్రతిపాదిస్తూ జులై 5న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. దీన్ని న్యాయశాఖ ఆమోదించింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్‌కు చెందిన ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 25న జన్మించారు.1989 అక్టోబర్ 18న దిల్లీ, జమ్మూకశ్మీర్ బార్కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2022 జూన్ 10న ఆయనను బాంబే హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ టీఎస్ ఠాకూర్‌గా సుపరిచితులైన జస్టిస్ తీరథ్సింగ్ ఠాకుర్‌కు తమ్ముడు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో మే 19 నుంచి ఆ స్థానం ఖాలీగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తాత్కాలిక సీజేగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారు. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Next Story