Mon Dec 23 2024 10:13:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫోర్బ్స్ యువసాధకుల జాబితాలో ద్రాక్షారామం యువకుడికి చోటు
ఇప్పటి వరకు 25కు పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు శివతేజ సహరచన చేశారు.
ఫోర్బ్స్ యువ సాధకుల జాబితాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన కాకిలేటి శివతేజ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం శివతేజ బెంగళూరులో రొమ్ముకేన్సర్ ను గుర్తించే ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 25కు పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు శివతేజ సహరచన చేశారు. అలాగే 23 అంతర్జాతీయ పేటెంట్లను సొంతం చేసుకున్నారు. ఆయన పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రచురించిన యువసాధకుల టాప్ 30 జాబితాలో శివతేజకు చోటిచ్చింది.
ద్రాక్షారామానికి చెందిన శివతేజ.. ఐఐటీ గువాహటిలో ఈసీఈని మేజరు డిగ్రీగా, సీఎస్ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో కొందరితో కలిసి నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. అందులో రొమ్ము కేన్సర్ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తూ మెషీన్ లెర్నింగ్ టీంకు నాయకత్వం వహిస్తున్నారు. ఓ వైపు పరిశోధనలు చేస్తూనే.. నెదర్లాండ్స్ లో మాస్ట్రక్ట్ యూనివర్సిటీలో క్లినికల్ డేటా సైన్స్ లో పీహెచ్ డీ పూర్తిచేశారు.
Next Story