Sat Nov 09 2024 02:09:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో బాదుడు మొదలు.. విద్యుత్తు ఛార్జీల మోత?
ఎన్నికల ప్రచారంలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే వ్యవహరిస్తున్నారు
ఎన్నికల ప్రచారంలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే వ్యవహరిస్తున్నారు విద్యుత్తు ఛార్జీలను పెంచబోమంటూ, ఐదేళ్లు ఇవే ధరలను కొనసాగిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్దుబాటు ఛార్జీల పేరుతో ధరల బాదుడుకు దిగారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో 8,113 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమయిందన్న సమాచారంలో వామపక్షాలు వాడవాడలా ఆందోళనకు దిగాయి. ట్రూ అప్ ఛార్జిల ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ బాదుడు మొదలు పెట్టింది కూటమి సర్కార్.
ట్రూ అప్ ఛార్జీలు...
గత ప్రభుత్వం ఇదే రకంగా ట్రూ అప్ ఛార్జీలను అమలు చేసి విద్యుత్తు ఛార్జీల భారం మోపింది. అప్పుడు ఆ ధరలపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తుండటం విడ్డూరంగా ఉందని వైరి పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రజలపై భారం మరింత మోపడానికే తెలియకుండానే ఈ విద్యుత్తు ఛార్జీల మోత పడనుంది. సర్దుబాటు ఛార్జీల పేరుతో వడ్డనకు దిగితే ఆందోళనకు దిగుతామని సీీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు.మరో వైపు ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదనలపై ఎలాంటి కామెంట్స్ రాలేదు. ఎవరూ దీనిపై స్పందించకపోవడంతో విపక్షాలు, ప్రజలు మరింత బలపడే అవకాశముంది.
వంద రోజుల్లోపే...
నిజానికి కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ కూడా తమ ఎన్నికల మ్యానిఫేస్టోలో విద్యుత్తు ఛార్జీలను పెంచబోమని చెప్పింది. దీంతో పాటు ప్రతి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు బాదుడే బాదుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వైసీపీ ఓటమికి విద్యుత్తు ఛార్జీలు పెంచడం కూడా ఒక కారణమని అంటారు. చిరు వ్యాపారులు ముఖ్యంగా విద్యుత్తు ఛార్జీలు చెల్లించలేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారని అనేక మంది గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత ఈ విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదన తేవడంపై విపక్షాలే కాదు జనాగ్రాహానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
.
Next Story