Mon Dec 23 2024 10:52:19 GMT+0000 (Coordinated Universal Time)
Michoung Cyclone : మిచౌంగ్ తుఫాన్...ముప్పు మామూలుగా ఉండదట
మిచౌంగ్ తుఫాను ప్రభావం క్రమంగా సీన్ చూపిస్తోంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి
మిచౌంగ్ తుఫాను ప్రభావం క్రమంగా సీన్ చూపిస్తోంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షం కురుస్తుంది. తీర ప్రాంతంలో హై అలర్ట్ ను ప్రకటించారు. పర్యాటకులను ఎవరినీ సముద్ర తీరానికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు. ప్రధానంగా బాపట్ల వద్ద తీరం దాటుతుందన్న సమాచారంతో సూర్యలంక బీచ్ వద్ద మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలలు ఎగిసి పడుతుండటంతో ఎవరినీ అడుగు కూడా అటువైపు వెళ్లకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాత్రికి ఈదురుగాలులు...
ఈ రాత్రికి భారీ ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పడంతో ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మిచౌంగ్ తుఫాన్ తీరం దాటే సమయంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందువల్ల ఎవరూ అజాగ్రత్తగా ఉండి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని వార్నింగ్లు ఇచ్చారు. కోస్తాంధ్ర ప్రాంతంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాలను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారులతో సమీక్షించి ప్రాణ నష్టం లేకుండా చూడాలని, సహాయక శిబిరాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
విద్యుత్తు సరఫరాను...
విద్యుత్తు సరఫరా కూడా ఈరాత్రికి నిలిచిపోయే అవకాశముంది. బలమైన ఈదురుగాలులతో విద్యుత్తు స్థంభాలు నేలకొరిగే అవకాశమున్నందున ఎవరూ విద్యుత్ షాక్ కు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తును నిలిపేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే గాలులు ప్రారంభమయిన వెంటనే విద్యుత్తు సరఫరాను నిలపేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రైళ్లు కూడా రద్దయ్యాయి. కోస్తా తీర ప్రాంతం మీదుగా వెళ్లే వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు.
ఉద్యోగుల సెలవుల రద్దు...
మరో 24 గంటల పాటు తుఫాను ముప్పు ఉండటంతో అధికారులు అన్ని జిల్లాలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. బాధితులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కోస్తా తీరంలో ఉన్న జిల్లాలకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. వెంటనే నష్టం అంచనా వేయాలని కూడా ముఖ్యమంత్రి జగన్ సూచించారు. దీంతో అధికారులు 24/7 అప్రమత్తంగానే ఉంటున్నారు. ప్రజలు కూడా వారికి సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది. మొత్తంమీద మిచౌంగ్ తుఫాను గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. తీరం దాటేంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే.
Next Story