Sat Jan 11 2025 10:05:58 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ అన్నారంటే అంతే... చెప్పారంటే చేయాలంతే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరుకు ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన నోటి నుంచి వచ్చిన మాట చెల్లుబాటు అయి తీరుతుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరుకు ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన నోటి నుంచి వచ్చిన మాట చెల్లుబాటు అయి తీరుతుంది. పవన్ కల్యాణ్ వాస్తవ విషయాలను మాత్రమే చెబుతారంటారు. అందుకే ఆయన చెప్పే ప్రతి మాటకు కూటమి పార్టీలు విలువ ఇస్తాయి. పవన్ కల్యాణ్ కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా భావిస్తారు. అందుకే ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే దానికి ఎంతో విలువ ఇస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ చేసే ప్రతి కామెంట్స్ ను సీరియస్ గానే తీసుకుంటారు. అందులో లోటుపాట్లు ఉంటే సరిచేస్తుంటారు. పవన్ ను నొప్పించడం అంటూ చంద్రబాబు చేయరన్నది వాస్తవం.
చంద్రబాబు సయితం...
ఎందుకంటే.. తాను స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి తనను పరామర్శించి అన్ కండిషనల్ గా జైలు బయటే పొత్తు ప్రకటించడంతో పవన్ పై అభిమానాన్ని చంద్రబాబు మరింత పెంచుకున్నారు. దీంతో పాటు రాజకీయంగా పవన్ పక్కనుంటేనే విజయం సాధ్యమవుతుందని, అధికారం దక్కుతుందని కూడా ఆయన విశ్వసిస్తారు. పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానుల సంఖ్యతో పాటు యువ ఓటర్లు, ఇటు కాపు సామాజికవర్గం ఓటర్లు కూడా తమకు అండగా నిలుస్తారని, అందుకే గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రయికింగ్ రేట్ వచ్చిందని చంద్రబాబు బలంగా నమ్ముతారు. బీజేపీ తమతో కలసి రావడానికి కూడా పవన్ కల్యాణ్ ప్రధాన కారణమని ఆయనకు తెలుసు.
మరోసారి కూటమితో...
అదే సమయంలో రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరోసారి విజయం సాధించాలంటే కూటమితో ముందుకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అంత ప్రయారిటీ ఇస్తారు. ఆ మధ్య హోం మంత్రిత్వ శాఖపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసినా వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే రకంగా పవన్ కల్యాణ్ వల్ల తనకు సీట్ల కేటాయింపుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. మంత్రి పదవుల విషయంలోనూ పవన్ పట్టుదలకు పోలేదు. నామినేటెడ్ పోస్టుల మంజూరు విషయంలోనూ పవన్ కల్యాణ్ ఇబ్బంది పెట్టకపోవడంతో ఆయన మాటలకు మరింత విలువ చంద్రబాబు వద్ద పెరిగిందనే చెప్పాలి.
టీటీడీ క్షమాపణ...
ఇక తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేర్వేరుగా అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించారు. చంద్రబాబు ఒకలా రియాక్ట్ అయితే.. పవన్ కల్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి, అధికారులపై మండి పడ్డారు. వారివల్లనే ఈ తప్పిదం జరిగిందన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. కానీ టీటీడీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎవరో చెప్పారని క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదని తొలుత అన్నారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని కూడా ప్రశ్నించారు. తిరిగి గంట గడవక ముందే మరోసారి మీడియా ముందుకు వచ్చి పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అందుకు చంద్రబాబు నుంచి ఫోన్ రావడమే కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీని శాసిస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
Next Story