Fri Dec 20 2024 06:16:21 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీపై చేసిన విమర్శలకు మాత్రం తాము చెక్ పెట్టేందుకు ప్రయత్నించడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీపై చేసిన విమర్శలకు మాత్రం తాము చెక్ పెట్టేందుకు ప్రయత్నించడం లేదు. నాడు రాజకీయంగా విమర్శలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటి గురించి పట్టించకోవడం మానేశారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టిన నాటి కూటమి నేతలు ఆ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలన్న ఆలోచన చేయడంలేదు. ఇందుకు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఖాజానా ఖాళీగా ఉండటమేనంటున్నారు. లేకుంటే తాము ఎన్నికల్ల వైసీపీ పై చేసిన విమర్శలకు చెక్ పెట్టే వాళ్లమంటున్నారు.
జగన్ ప్రభుత్వం పెంచిన...
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు ధరలను జగన్ ప్రభుత్వం పెంచింది. ఎలా అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోలు బంకుల్లో ధరలు ఎక్కువ. లీటరుపై రూపాయి నుంచి రూపాయిన్నర, రెండు రూపాయల వరకూ తేడా ఉంది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోలు రేట్లు ఎక్కువ. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్, పవన్ పదే పదే ప్రస్తావించేవారు. లారీల యజమానులు, ప్రయివేటు బస్సుల ఓనర్లు కూడా ఆందోళన చేసినా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆదాయం కోసం పెంచామంటూ ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిందే తప్ప జగన్ ప్రభుత్వం పైసా కూడా తగ్గించలేదు.
తగ్గిస్తారని భావించినా...
అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తారని భావించారు. ఎందుకంటే విజయవాడ ట్రాన్స్పోర్టు కార్యకలాపాలకు అడ్డా. వేల సంఖ్యలో లారీలుంటాయి. అలాగే ప్రయివేటు బస్సులు కూడా ఎక్కువే. ఇవి నిత్యం వేల కిలోమీటర్ల దూరం వెళుతుంటాయి. బెజవాడలో లారీ యాజామన్యం సంఘం కూడా ధరలు తగ్గిస్తారని ఆశించింది. ఇక్కడ ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాలలో పెట్రోలు, డీజిల్ కొట్టించుకుని వెళ్లడం తమ అలవాటుగా మార్చుకున్నారు. ఏపీలో టూవీలర్స్ కార్లు వంటివి మినహా అక్కడ పెట్రోలు, డీజిల్ ను పోయించుకోవడంలేదు. కార్లు అయితే తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చి ట్యాంక్ ను ఫుల్ చేసుకుంటున్నారు.
రాష్ట్ర ఆదాయానికి...
దీని వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై లారీల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు త్వరలోనే ఈ విషయంలో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో ఉన్న వాహనాల యజమానులకు ఇచ్చిన హామీ మేరకు అతి త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం కొంత గాడిలో పడిన తర్వాత మాత్రమే ధరలు తగ్గించే అవకాశముందంటున్నారు. అప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎప్పుడో?
Next Story