Fri Nov 22 2024 18:41:17 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఎన్నికల వ్యూహకర్తలకు ఇక కాలం చెల్లిందా? సొంత వ్యూహాలే బెటర్ అనిపిస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ఇంకా గెలుపు, ఓటములపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ఇంకా గెలుపు, ఓటములపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో ఒక విషయం మాత్రం తెలిసి వచ్చిందేమిటంటే.. సర్వే సంస్థలతో పాటు వ్యూహకర్తలు కూడా వృధాయేయనని. వ్యూహకర్తలు కేవలం బ్యాక్ ఎండ్ లో కొన్ని కార్యక్రమాలను రూపొందించడానికే ప్లాన్ చేయాలి. వారు సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. అంతే తప్ప వారి సలహాలు, సూచనలు వింటే మనకు ఉన్న స్థానాలు కూడా రావని అర్థమయిపోయిందనడానికి జగన్ పార్టీ ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. జగన్ తాను చేసిన తప్పులేమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అయితే ఓటమి తర్వాత అసలు విషయం అర్థమయినా ప్రయోజనం ఏమీ లేకపోయినా.. రానున్న కాలంలో ఈ అనుభవాలు ఉపయోగపడవచ్చు. కోట్ల రూపాయలు వెచ్చించి వ్యూహకర్తలను, టీంలను నియమించుకున్నా సీట్లు రావని తేలిపోయింది.
బాబు మాత్రం...
చంద్రబాబును తీసుకుంటే.. ఆయన కూడా వ్యూహకర్తను నియమించుకున్నారు. రాబిన్ శర్మ టీం ఆయన వెంట ఉంది. కానీ రాబిన్ శర్మ టీం నివేదికలను చంద్రబాబు ఎన్నడూ పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం తన కార్యక్రమాల ప్లానింగ్ వరకే వినియోగించుకున్నారు. సోషల్ మీడియాలో వాళ్ల టీం ఈ ఎన్నికల్లో సక్సెస్ అయింది. అధికార పార్టీ వైసీపీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే కార్యక్రమాలను రూపొందించింది. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి, నారా లోకేష్ యువగళం, చివరిలో ప్రజాగళం పేరిట సభలను డిజైన్ల వరకే వారిని పరిమితం చేశారు. క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థుల జాబితాను తెప్పించుకున్నప్పటికీ చంద్రబాబు చివరకు పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన స్థానాల్లో తాను అనుకున్న వారికి, పార్టీని నమ్ముకున్న వారికే టిక్కెట్లు కేటయించారు.
ఐ ప్యాక్ టీం నివేదికలపైనే...?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా జనంలోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇందుకు రాబిన్ శర్మ టీం కూడా సోషల్ మీడియా వేదికగా కొంత ఊతమిచ్చింది. అయితే జగన్ విషయానికి వస్తే కేవలం ఐప్యాక్ టీం పైనే ఆధారపడి ఆయన అభ్యర్థుల ఎంపికను చేశారు. కొన్ని చోట్లను మినహాయించి, అంటే రాయలసీమలో తప్పించి మిగిలిన చోట్ల ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఐ ప్యాక్ టీం చేసిన సూచనలు ఎక్కువగా పరిగణనలోకి తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే సత్ఫలితాలు వస్తాయని ఐ ప్యాక్ టీం ఇచ్చిన నివేదికలను గుడ్డిగా అమలు పర్చడంతోనే ఈ దారుణ ఓటమి సంభవించడానికి కారణమని ఇప్పుడు ఎమ్మెల్యేలు బయటపడుతున్నారు. కొత్త చోట నాయకత్వాన్ని సెట్ చేసుకుని, నమ్మకమైన నేతలకు డబ్బులు ఇచ్చే సరికే ఎన్నికల సమయం వచ్చేసిందని చెబుతున్నారు.
ఆ అధికారి నివేదికను...
జగన్ చేతిలో స్థానిక సంస్థల ప్రతినిధులు పుష్కలంగా ఉన్నారు. వారితో ఒక్క సమావేశం కూడా ఆయన ఈ ఐదేళ్లలో ఏర్పాటు చేయలేదు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేయలేదంటున్నారు. దీంతో పాటు ఇంటలిజెన్స్ అధికారి ఒకరు ఎన్నికలకు ముందుగానే కొంత లీకేజీ ఇచ్చినా జగన్ దానిని పట్టించుకోలేదంటున్నారు. సదరు ఇంటలిజెన్స్ అధికారి ఇచ్చిన నివేదికను చూసి జగన్ పిచ్చినవ్వు నవ్వారు తప్పించి అందులో నిజానిజాలను కూడా వెలికి తీసే ప్రయత్నం చేయలేదని ఒక ముఖ్య అధికారి తెలిపారు. ఆ ఇంటలిజెన్స్ అధికారి ఎన్నికలకు మూడు నెలల ముందే వైసీపీకి పదిహేను సీట్లకు మించి రావని చెప్పారన్నది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆరోజు ఆ అధికారి నివేదికను సీరియస్ గా తీసుకుంటే ఇంతటి నష్టం జరిగేది కాదని అంటున్నారు.
Next Story