Tue Nov 05 2024 14:57:31 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : వరద తగ్గింది కానీ.. వ్యాధుల ముప్పు పొంచి ఉన్నాయ్.. జాగ్రత్త
విజయవాడకు వరద ముప్పు తగ్గినప్పటికీ వ్యాధుల భయం వెంటాడుతుంది.
విజయవాడ సేఫ్ జోన్ లోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం తగ్గుతుంది. దీంతో అనేక కాలనీల్లో నిన్నటి వరకూ నడుముకు పైగా ఉన్న లోతులో నీరు ఉండగా, నేడు అది నాలుగు అడుగుల వరకూ తగ్గింది. బుడమేరు నీటి ప్రవాహం కూడా తగ్గడంతో బాధిత ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తేరుకుని ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇళ్లలో వస్తువులన్నీ తడిసి పోవడంతో అనేక మంది పిల్లాపాపలతో కలసి తమ బంధువుల ఇంటికి వెళుతున్నారు. కొందరు గుంటూరుకు వెళుతుండగా, మరికొందరు విజయవాడలోనే నీట మునగని ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.
పొంచి ఉన్న....
అయితే ఇదిలా ఉండగా వరద తగ్గుతుండటంతో ఇక వ్యాధుల భయం మాత్రం పొంచి ఉంది. నాలుగు రోజుల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాచకుండా నీరు తాగితే అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశముందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహార పొట్లాలను కూడా ఎప్పటికప్పుడు వినియోగించాలని, ఫ్రిడ్జ్ లో ఉంచుకుని నిల్వపెట్టుకుని తర్వాత తిందామని భావిస్తే రోగాల బారిన పడే అవకాశముందని వార్నింగ్ ఇస్తున్నారు.
దోమల బెడదతో...
మరోవైపు దోమల బెడద కూడా తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. దీని వల్ల విషజ్వరాలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అతిసార, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సంక్రమించే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. విజయవాడలో దాదాపు యాభై శాతం ప్రాంతం మునిగిపోయింది. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలంటే విజయవాడ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది సరిపోరు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులను, పారిశుద్ధ్య సిబ్బందిని విజయవాడకు రప్పిస్తున్నారు. రెండు, మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉండి యుద్ధప్రాతిపదికపైన పనులు చేపట్టనున్నారు. అంటు వ్యాధులు కూడా సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
హెల్త్ క్యాంప్ లు...
మరోవైపు నీట మునిగిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ, రెడ్ క్రాస్ వంటి సంస్థలు హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అవసరమైన మందుల పంపిణీ జరుగుతుంది. అయినా సరే.. వరద నీరు తగ్గే కొద్దీ వ్యాధులు మరింత పెరిగే అవకాశముంది. విజయవాడ వరదల్లో లక్షల సంఖ్యలో ప్రజలు బాధితులుగా ఉండటంతో వారు రెండు రోజుల నుంచి సరైన నీరు, భోజనం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే ప్రతి చోటా హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయడంతో పాటు హెల్త్ ఎమెర్జెన్సీ ఉన్న వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మొత్తం మీద బెజవాడ వాసులూ వరద తగ్గినా కొద్ది రోజుల పాటు తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరకలు పెడచెవిన పెట్టకుండా తగు విధమైన జాగ్రత్తలు పాటించాలి.
Next Story