Mon Dec 23 2024 11:54:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సంక్షేమ పథకాలను చంద్రబాబు వాయిదాకు అసలు కారణం అదేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ పై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ పై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈసారి రాష్ట్రానికి ఎంత వరకూ నిధులు తేగలరు అన్న అంశంపైనే టీడీపీలోనూ, ఇటు విపక్ష వైసీపీలోనూ చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడోసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీని, మరికొందరు కేంద్ర మంత్రులను నేడు కలవనున్నారు. అయితే ప్రధానంగా నిధులకన్నా గత ప్రభుత్వం చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకే ప్రత్యేకంగా ఈ హస్తిన పర్యటనను పెట్టుకున్నట్లు సమాచారం. రుణాల రీ షెడ్యూల్ జరిగితే కొంత వరకూ రాష్ట్రం మీద ఆర్థిక భారం పడకుండా వెసులుబాటు ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు.
పది లక్షల కోట్లను...
గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. వాటికి వడ్డీ చెల్లించడానికే ఎక్కువ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తుంది. అందుకు కొన్ని సంక్షేమ పథకాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని టీడీపీ నేతల వాదనగా వినిపిస్తుంది. వడ్డీ భారం లేకపోతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలని ఉన్నా వడ్డీలు కట్టాల్సి రావడంతో వీటిని వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే తిరిగి చంద్రబాబు ప్రభుత్వం కూడా వివిధ సంస్థల నుంచి రుణాలను తీసుకోవాల్సి ఉంటుంది.
సూపర్ సిక్స్ హామీని...
గత ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీని చంద్రబాబు ఇచ్చారు. ప్రతి సభలో ఆయన పదే పదే సూపర్ సిక్స్ గురించి ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ ఏడాదికి పదిహేను ఇస్తామని చెప్పారు. యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ నెలకు నాలుగు వేల రూపాయల పింఛను కూడా ఇస్తామన్నారు. అవేమీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా అమలు పర్చ లేదు. దీనికి కారణం ఖజానాలో నిధుల కొరతేనని చెబుతూ వస్తున్నారు. కానీ అసలు కారణం అసలు కంటే వడ్డీ కట్టడానికే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉన్నందున వెల్ఫేర్ స్కీమ్ లను ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నది అధికార పార్టీ వాదనగా ఉంది.
ఖజానా ఖాళీ...
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చెప్పడంతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా వివరించడంతో ఆయన కూడా వాయిదా వేయడమే మంచిదని సలహా ఇచ్చారట. అయితే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పర్చకపోవడంపై ఇప్పటికే ప్రజల్లో కొంత అసంతృప్తి బయటపడుతుంది. బటన్ నొక్కడం ఏముంది? మంచం మీద ముసలమ్మ కూడా నొక్కుతుందని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు అదే బటన్ నొక్కేందుకు భయం పట్టుకుంది. దీంతో ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ అయి రుణాల రీ షెడ్యూల్ చేయాలన్న ప్రధాన డిమాండ్ వారి ముందు ఉంచనున్నారని తెలిసింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story