Mon Dec 23 2024 03:48:50 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : దీపావళి పండగ కాదు.. అది ఊరు.. మీకు తెలుసా?
దీపావళి పండగ అందరికీ తెలిసిందే. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఆ పేరిట ఒక గ్రామం ఉంది
దీపావళి పండగ అందరికీ తెలిసిందే. దీపావళి అంటే దివ్వెల పండగ. వెలుగుల పండగ. స్వీట్లు, టపాసులతో ఆనందంతో జరుపుకునే దీపావళి అంటే ఒక పండగ అని మాత్రమే అందరికీ తెలుసు. దీపావళి అంటే ఠక్కున గుర్తొచ్చేది పండగ. నరాకాసురుడిని సత్యభామ వధించిన రోజు అంటూ చిన్న పిల్లలు కూడా ఠక్కున చెబుతారు. అలాంటి దీపావళి పేరిట ఒక ఊరు ఉంది. అదీ ఆంధ్రప్రదేశ్ లో నన్న సంగతి మీకు తెలుసా. ఇది నిజం. ఆ ఊరు పేరే దీపావళి. దీపావళి అంటే పండగ కాదు.. బస్సెక్కి దీపావళి అని చెబితే అలవాటున్న కండక్టర్ టిక్కెట్ ఇస్తారు. కొత్త కండక్టర్ అయితే నోరు వెళ్లపెడతారు. అసలు దీపావళి పండగ పేరుతో ఒక ఊరు వెలిసిందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లాలోని...
దీపావళి గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా గారమ మండలంలో ఉంది. అయితే ఈ ఊరికి దీపావళి అనే పేరు పెట్టడానికి చరిత్ర కూడా ఉందంటారు గ్రామస్థులు. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అనే నామకరణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. సిక్కోలు రాజు గుర్రంపై అటుగా వెళ్లేటప్పుడు ఎండకు తాళలేక ఆ గ్రామ సమీపంలోని కొబ్బరితోటలో స్పృహతప్పి పడిపోయాడట. వెంటనే అక్కడ కూలీలు ఆయనను చూసి ఆయనకు ప్రాధమిక చికిత్స అందించారు. ఆయన తేరుకుని వారిని అభినందించారు. అదే రోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి ఆ రాజు దీపావళిగా నామకరణం చేసినట్లు పెద్దలు చెబుతారు.
అప్పటి నుంచే...
అప్పటి నుంచి ఆ గ్రామానికి దీపావళిగా పేరు స్థిరపడిపోయింది. రెవెన్యూ రికార్డుల్లోనూ దీపావళిగానే ఉంది. గార మండలం కొంటి పంచాయతీ పరిధిలో ఈ దీపావళి గ్రామం ఉంది. ఇక్కడ వెయ్యి మంది వరకూ జనాభా ఉంటారు. అయితే దీపావళి పండగ పేరును తమ గ్రామానికి రావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటారు. నేటి జనరేషన్ కూడా దీపావళి గ్రామానికి వచ్చి పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న వారు దీపావళికి దీపావళికి చేరుకుని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈ గ్రామంలో మూడు వందల గడపలున్నాయి. అందుకే దీపావళి అంటే ఇక్కడ పండగ మాత్రమే కాదు.. ఊరు కూడా.
Next Story