Mon Dec 23 2024 05:04:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు - మాజీ హోంమంత్రి సుచరిత
హోంమంత్రి పదవి ఇచ్చినందుకు థాంక్స్ గివింగ్ లెటర్ ఇస్తే.. దానినే రాజీనామా పత్రం అంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. తనకూతురి
తాడేపల్లి : ఏపీ మాజీ హోం మంత్రి ఎట్టకేలకు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సీఎంతో భేటీ అనంతరం మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని, అదంతా కేవలం మీడియా సృష్టించిన అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. హోంమంత్రి పదవి ఇచ్చినందుకు థాంక్స్ గివింగ్ లెటర్ ఇస్తే.. దానినే రాజీనామా పత్రం అంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. తనకూతురికి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేదని, అలాంటి చిన్నపిల్ల చెప్పిందే పట్టుకుని రాజీనామా చేశాననడం సరైనది కాదని మీడియాకు చెప్పారు.
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉంటానని, పదవులు ఉన్నా లేకపోయినా సీఎం జగన్ వెంటే ఉంటానని తెలిపారు. ఇటీవల కాలంలో తనకు సర్జరీ జరగడంతోనే బయటికి రాలేకపోయానని, రెండు వారాల క్రితమే ఆపరేషన్ జరగడంతో సీఎం జగన్ ను కలవలేకపోయానన్నారు. అంతే తప్ప.. తనకు సీఎం వద్దకు ప్రవేశం లేదని, తనపై సీఎం ఆగ్రహంగా ఉన్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. కేబినెట్ ను మారుస్తున్నట్లు జగన్ తనకు ముందే చెప్పారని, మంత్రి పదవి లేనందుకు తాను బాధపడటం లేదన్నారు. దళిత మహిళ అయిన తనను జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయికి తీసుకొచ్చింది వైసీపీనేనని, పార్టీకి తన పూర్తి సహకారం ఉంటుందని సుచరిత స్పష్టం చేశారు.
Next Story