Mon Dec 23 2024 06:11:02 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నానికి చుక్కలు చూపించనున్నారా? తర్వాత టార్గెట్ ఆయనేనా?
మాజీ మంత్రి కొడాలి నాని ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. గత ఐదేళ్లు కొడాలి నాని టీడీపీ అగ్ర నేతలపై విరుచుకుపడ్డారు
మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అని చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్లు కొడాలి నాని టీడీపీ అగ్ర నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వద్ద నుంచి లోకేష్ వరకూ ఎవరిని వదలకుండా ఆయన విమర్శలు చేసేవారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. కొడాలి నాని అసెంబ్లీలోనూ, బయట కూడా టీడీపీ అధినాయకత్వంపై చేసిన విమర్శలతో అప్పట్లో కొంత వైసీపీకే ఇబ్బందికరంగా మారింది. అయినా ఆయన ఏనాడూ తన విమర్శల నుంచి బయటకు పోలేదు. తనను గుడివాడలో ఓడించేదెవరు? అంటూ సవాల్ విసిరిన సందర్భాలు కూడా అనేక సార్లు ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ లపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ తెలుగుతమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు.
తొలిసారి ఓటమి....
అయితే ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని కొడాని నాని గుడివాడలో తొలిసారి ఓటమిపాలయ్యారు. గతంలో ఎన్నోమార్లు ఆయనను ఓడించాలన్న టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు గుడివాడలో తిరుగులేదని భావించారు. 2024 ఎన్నికల్లోనూ తనను ఓడంచడం అసాధ్యమని ఆయన గట్టిగా నమ్మారు. ఒకటి.. తాను గుడివాడలో చేసిన అభివృద్ధితో పాటు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు. అలాంటిది వెనిగండ్ల రాము చేతిలో ఆయన దారుణంగా ఓటమిపాలయ్యారు. నిజానికి ఆయన ఊహించని ఓటమి. ఇది జీర్ణించుకోవడానికి ఆయన చాలా సమయం పట్టింది.
హైదరాబాద్ లోనే...
దీంతో కొడాలి నాని గుడివాడను వదిలేసి హైదరాబాద్ కే ఎక్కువ సమయం పరిమితమయ్యారు. తన ముఖ్య అనుచరులకు మినహా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించడం లేదు. కొంత కాలం దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుంది. తనను లక్ష్యంగా చేసుకుంటారని కొడాలి నానికి తెలియంది కాదు. అందుకే ఆయన ముందు జాగ్రత్తగా గుడివాడకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉంటూ అవసరమైతే తప్ప ఎవరికీ ఫోన్ లు కూడా చేయడం లేదు. ఎవరైనా ఆయనను కలవాలనుకుంటే హైదరాబాద్ కు వెళ్లి కలవడం మినహా మరో అవకాశం లేదు.
ముందస్తు బెయిల్...
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కొడాలి నానిపై వరస కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని పోలీసులు పావులు కదుపుతున్నారు. పాత కేసులు తిరగదోడుతున్నారని తెలిసింది. త్వరలోనే కేసులు నమోదు చేసి కొడాలి నానిని అరెస్ట్ చేస్తారని గుడివాడలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో కొడాలి నాని అనుచరులు ఆందోళనలో ఉన్నారు. తమ నేత అరెస్టయితే తమ పరిస్థితి ఏంటన్న ఆవేదనలో ఉన్నారు. అయితే కొడాలి నాని మాత్రం గుడివాడ రాకుండా హైదరాబాద్ లో ఉంటూ తనపై నమోదయిన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించే పనిలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద కొడాలి నాని అరెస్ట్ కు అంతా సిద్ధమయినట్లు జరుగుతున్న ప్రచారంతో వైసీపీ కార్యకర్తల్లో అలజడి ప్రారంభమయింది.
Next Story