Wed Nov 27 2024 10:40:12 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్లేనా?
మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నాని ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నాని ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. గుడివాడకు రావడం కూడా పూర్తిగా తగ్గించేశారు. అయినా సరే కొడాలి నానిని అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి అధినాయకత్వానికి వత్తిడి పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోవడమేంటని క్యాడర్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. నానిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయనపై కేసులు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ ఊపందుకోవడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు సమాచారం.
కేసులు నమోదు చేసి పకడ్బందీగా...
ఇటీవల జగనన్న కాలనీలకు సంబంధించి గుడివాడలో సేకరించిన భూములపై కేసు నమోదయిందని తెలిసింది. దీంతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే కేసులు పెడితే పకడ్బందీగా ఉండాలని, బెయిల్ కూడా దొరకని సెక్షన్లు నమోదు చేసి కొంత కాలం జైల్లో ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అందులో భాగంగా కొన్ని పాత కేసులను పోలీసులు బయటకు తీస్తున్నట్లు కనిపిస్తుంది. పకడ్బందీగా సాక్షాధారాలను కూడా సేకరిస్తున్నారని చెబుతున్నారు.
అనుచరులుపైనా...?
అదే సమయంలో గుడివాడలో కొడాలి నాని ప్రధాన అనుచరులపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఎన్నికల్లో సహకరించిన వారు మాత్రమే కాకుండా భవిష్యత్ లో కొడాలి నానికి అనుకూలంగా ఉండే ప్రధాన అనుచరులపై కేసులు నమోదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని, వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబు, నారా కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు తమ చెవుల్లో మారుమోగిపోతున్నాయంటున్నారు. అందుకే కొడాలి నానిని అరెస్ట్ చేయాలంటూ కూటమి పార్టీల నుంచి డిమాండ్ అధికంగా వస్తుండటంతో పోలీసులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతుంది. వీలయినంత త్వరలోనే కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అందుతున్న వార్తలను బట్టి సమాచారం అందుతుంది.
Next Story