Mon Dec 23 2024 08:48:51 GMT+0000 (Coordinated Universal Time)
Paritala Sunitha : సునీతమ్మ.. హర్ట్ అయినట్లుందిగా... పరిటాల కుటుంబానికి అన్యాయం జరిగిందనేనా?
మాజీ మంత్రి పరిటాల సునీతకు కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో వారి అనుచరుల్లో అసంతృప్తి నెలకొని ఉంది
రాయలసీమలో పరిటాల కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటుంది. పరిటాల రవి ఉన్ననాళ్లు సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పార్టీని ఒంటిచేత్తో గెలిపించేవారు. రవి మరణం తర్వాత సునీతమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. పరిటాల శ్రీరామ్ యువకుడు కావడంతో ఆయనను పక్కన పెట్టి సునీత నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో పనిచేశారు. పరిటాల కుటుంబం అంటేనే టీడీపీ క్యాడర్ లో ఒకరకమైన ప్రేమ.. అభిమానం. ఎందుకంటే పరిటాల రవి పేరు ఇప్పటికీ అక్కడ మార్మోగుతుంటుంది. ఆయనను అభిమానించే వాళ్లు సునీతమ్మ కుటుంబాన్ని కూడా ఆదరిస్తూ వస్తున్నారు.
గట్టిపట్టున్న కుటుంబం...
ధర్మవరం, పుట్టపర్తి, రాప్తాడు నియోజకవర్గాల్లో ఇప్పటికీ పరిటాల కుటుంబానికి గట్టి పట్టు ఉందన్నది కాదనలేని వాస్తవం. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి సునీత ఓడిపోయారు. అయితే అదే సమయంలో ధర్మవరం నుంచి వరదాపురం సూరి టీడీపీిని వదిలేసి బీజేపీలోకి చేరిపోయారు. దీంతో ధర్మవరం బాధ్యతలను ఎవరికివ్వాలా? అన్న దానిపై ఆలోచించి చివరకు పరిటాల శ్రీరామ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. రాప్తాడులో సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పార్టీ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. పార్టీ కష్ట సమయాల్లోనూ వారు పార్టీ జెండాను విడిచిపెట్టలేదు. ఆందోళనలు చేశారు. రోడ్లమీదకు వచ్చారు. కేసులు ఎదుర్కొన్నారు.
ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్...
అయితే 2024 ఎన్నికల్లో ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న నినాదంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాప్తాడు టిక్కెట్ మాత్రమే పరిటాల కుటుంబానికి ఇచ్చారు. పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గం బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేశారు. తిరిగి విజయం సాధించారు. అయితే ఆమెకు ఖచ్చితంగా చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కుతుందని అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఆమె పేరు కనిపించకుండా పోవడంతో ఒకింత పరిటాల అనుచరులు అవాక్కయ్యారు. ఎందుకిలా జరిగిందన్న దానిపై వారు పార్టీ అధినేతను నేరుగా అడగకపోయినా.. కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు.
సామాజికవర్గమే...
కానీ పరిటాల సునీతకు సామాజికవర్గం అడ్డంకిగా మారిందనే అంటున్నారు. అదే జిల్లా నుంచి ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ కు ఆర్థిక మంత్రిగా చేయాలని భావించడంతో పరిటాల సునీతకు మంత్రి పదవి దక్కలేదని అంటున్నారు. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే కావడంతో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదని చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె అనుచరులు మాత్రం కొంత అసంతృప్తిగానే ఉన్నారు. తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై గుర్రుగానే ఉన్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ లు ఇద్దరూ ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కనీసం అమరావతికి వచ్చి పార్టీ నేతలను కలిసే ప్రయత్నం చేయలేదంటున్నారు. మరి సునీతమ్మను పిలిచి నచ్చ చెప్పేదెవరు? చంద్రబాబు ప్రస్తుతం ఉన్న బిజీలో ఆమెకు ప్రయారిటీ ఇస్తారా? లేదా? అన్నది నేడు మడకశిర పర్యటనలో తేలనుంది.
Next Story