Sun Dec 22 2024 20:22:31 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం పనులపై జ్యుడిషియల్ విచారణ జరపాలి
తిరుమల విఐపి బ్రేక్ దర్శనాల లిస్టును ప్రతిరోజూ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు
తిరుమల విఐపి బ్రేక్ దర్శనాల లిస్టును ప్రతిరోజూ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనాల టికెట్ల కేటాయింపులో పారదర్శకత ఉండాలన్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో, జిల్లా కలెక్టర్ పోస్టింగులు ఇచ్చేందుకు మంత్రులు ఐదు కోట్లు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలన్నారు. దాదాపు 30 వేల కోట్లు ఖర్చు చేసినా ఇంకా పోలవరం పూర్తి కాలేదన్న ఆయన సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టుకు ఎంత నిధులు ఖర్చు చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలంటే సమగ్ర విచారణ జరిగి తీరాలని అన్నారు.
అప్పులు ఎంత?
2019లో చంద్రబాబు అధికారం దిగిపోయే సమయంలో 2.68 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, ఇప్పుడు 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నదని లెక్కలు తేలిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన అప్పులు ఏ జిల్లాలో ఎంత ఖర్చు చేశారో, ఎందుకు ఖర్చు చేశారో సీఎం చంద్రబాబు సమగ్ర వివరాలను బయట పెట్టాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, తిరుపతి లో పని చేసే వర్కింగ్ జర్నలిస్టులకు జూ పార్క్ స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అలిపిరి దగ్గరలో ఉన్న జూ పార్క్ ఏడువేల ఎకరాలు అందుబాటులో ఉన్నదని, తిరుపతి జూ పార్క్ ను వేరే చోటికి మార్చి, 7 వేల ఎకరాల స్థలంలో కొంత భాగాన్ని ఐటి హబ్ గా మార్చాలన్నారు. తద్వారా వందల కంపెనీలు ఏర్పాటు చేసి వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
Next Story