Fri Apr 18 2025 05:58:00 GMT+0000 (Coordinated Universal Time)
Pithapuarm : వర్మ క్రమంగా ఓపెన్ అవుతున్నారుగా... పిఠాపురంలో ఇక కష్టమేనా?
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.వర్మ పరోక్షంగా పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానిస్తున్నారని తెలిసింది.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.వర్మ పరోక్షంగా పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానిస్తున్నారని తెలిసింది. ఇన్నాళ్లు కొంత మౌనంగా ఉన్న వర్మ ఇక లాభం లేదనుకుని ఓపెన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లే కనపడుతుంది. తనను పిఠాపురం నియోజకవర్గంలో సైడ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఆయన తనదైన రీతిలో చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు కనపడుతుంది. వర్మ తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయినట్లు స్పష్టమైన సంకేతాలు జనంలోకి పంపుతున్నారు. తాను టీడీపీలోనే ఉంటూ పవన్ కల్యాణ్ కు తాను సహకరించే అవకాశం లేదని ఆయన చెప్పేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లే స్పష్టమవుతుంది.
తాజా వ్యాఖ్యలతో...
వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి లోకేశ్ నాయకత్వం అవసరమని తెలిపారు. టీడీపీకి లోకేశ్ ను రధసారధిగా నియమించాలని వర్మ డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వర్మ అన్నారు. లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలను అందుకుంటుందని వర్మ ఆకాంక్షించారు.టీడీపీకి భవిష్యత్ తరంనాయకులు ఉండాలన్న వర్మ, టీడీపీకి 2047 ప్రణాళిక కూడా అవసరమని వర్మ అభిప్రాయపడ్డారు. లోకేశ్ కారణంగానే యువత పార్టీ వైపు ఆకర్షితులవ్వడం కాకుండా, అన్ని వర్గాల ప్రజలు ఏకమవ్వడానికి కారణమయ్యారని వర్మ అన్నారు.
ఎన్నిక సమయం నుంచి...
పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల సమయం నుంచి టీడీపీ, జనసేన స్థానిక నేతలు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదలేదనడానికి అనేక ఆధారాలున్నాయి. దీనికి తోడు జనసేన కూడా వర్మ విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లే క్లారిటీగా ఉంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. పవన్ కల్యాణ్ విజయానికి ఎవరూ కారణం కాదని, జనసైనికులు, పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆయన అన్నారు. తర్వాత నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నాగబాబు ప్రారంభోత్సవాలు చేయడం కూడా వర్మ వర్గంలో పుండు మీద కారం చల్లినట్లయింది.
దీనికి కౌంటర్ గా...
దీంతో వర్మ నాగబాబుతో పాటు పవన్ కల్యాణ్ కు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. లోకేశ్ యువగళం పాదయాత్ర వల్లనే కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాల్లో గెలిచిందని, టీడీపీకి లోకేశ్ నాయకత్వం అవసరమని, అలాగే ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని కూడా వర్మ సమావేశంలో డిమాండ్ చేశారు. అంటే నాగబాబు పవన్ గెలుపునకు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అంటే వర్మ ఒక అడుగు ముందుకేసి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి లోకేశ్ నాయకత్వమే కారణమని చెప్పి ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వాలు రెండూ పిఠాపురం నియోజకరవర్గం విషయంలో జోక్యం చేసుకోకుంటే మాత్రం వివాదాలు మరింత ముదిరే అవకాశముంది.
Next Story