Sun Dec 22 2024 21:36:46 GMT+0000 (Coordinated Universal Time)
మృతదేహంతో ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం.. భుజం పై మోసుకుంటూ?
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో కుమారుడి మృతదేహాన్ని ఎనిమిది కిలోమటర్లు తండ్రి మోసుకెళ్లాడు
ఏజెన్సీ ప్రాంతాలంటేనే ప్రభుత్వాలకు పట్టవు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఆదివాసీలను అస్సలు పట్టించుకోరు. నాగరిక సమాజానికి దూరంగా ఉండటం, ప్రశ్నించే తత్వం లేకపోవడంతో వారికి దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. సరైన నీటి సౌకర్యం ఉండదు. అలాగే వైద్యం అందుబాటులో ఉండదు. ఇక రహదారి కూడా అంతే. ఒకవైపు మావోల సమస్య. దానిని సాకుగా చూపిస్తూ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో అరకొరగా పనులు చేస్తూ అసలు అభివృద్ది చేయకపోవడంతో గిరిజనుల బతుకు చిత్రం నేటికీ మారడం లేదు.
కొండలు.. కోనల్లో ఉంటున్న వారికి విద్య, వైద్యం అందుబాటులో తేవాలన్న స్పృహ కూడా పాలకులకు ఉండదు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం అక్కడకు వెళ్లి ఓట్లు అడగటానికి మాత్రం నేతలకు నోళ్లు తెరుచుకుంటాయి. అంతే తప్ప ఆ ఊళ్లు బాగుపర్చడానికి మాత్రం చేతులు పనిచేయవు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఘటన అందరినీ కలచి వేసింది. హృదయాన్ని పిండేసేలా ఉంది. కుమారుడి మృతదేహాన్ని మోసుకుని ఒక తండ్రి ఎనిమిది కిలోమీటర్లు చేరారంటే ఇక అంతకంటే దుస్థితి వేరే చెప్పనవసరం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి
మూడేళ్ల కుమారుడు...
అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ చినకొనేల గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఇటుక బట్టీలో పనిచేసేందుకు గుంటూరు వద్ద కొల్లూరు వెళ్లింది. అయితే వారి మూడేళ్ల కొడుకు మరణించడంతో ఇటుకుల బట్టీ యజమాని ఏజెన్సీ ప్రాంతం వరకూ వారిని వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి గ్రామానికి చేరుకోవాలంటే సరైన రహదారి లేదు. దీంతో ఎనిమిది కిలోమీటర్లు తండ్రి, తాత ఇద్దరూ మోసుకుంటూ ఆ బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ పాలకుల మనసులు మారడం లేదు. గిరిజనుల బతుకుల్లో మార్పు చోటు చేసుకోవడం లేదు.
Next Story