Fri Nov 22 2024 19:52:16 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీకి పాకిన ఈవీఎల గొడవ.. ఇది కొత్తేమీ కాకపోయినా..ఓటమి బాధ నుంచి బయటపడటానికేనా? అందులో నిజమెంత?
ఈవీఎంలపై జరుగుతున్న రగడ ఆంధ్రప్రదేశ్ కు పాకింది. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంది
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఒకరికి గెలుపు దక్కిదే..మరొకకిరి ఓటమి ఆటోమేటిక్ గా చేరువవుతుంది. ఓటమిని సానుకూలంగా ఎవరూ తీసుకోరు. అటు చంద్రబాబు అయినా.. ఇటు జగన్ అయినా.. గెలిస్తే తమ గొప్పలుగా చెప్పుకుంటారు. ఓడితే సాకులు వెతుకుతుంటారు. ఇందులో ఎవరూ మినహాయింపులు కాదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని, అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈవీఎంలను తొలగించాలని ఆయన ట్వీట్ చేశారు. అయితే భారత్ దేశంలో కూడా ఇది చర్చనీయాంశమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోనూ ఇది పెద్ద విషయంగా మారింది. ముఖ్యంగా ఈవీఎంల వల్లనే తమ ఓటమి అంటూ ఓడిపోయిన వారు చెబుతుండటం, వారిపై గెలిచిన వారు గేలి చేస్తుండటం వినిపిస్తుంది.
చంద్రబాబు అప్పుడు...
2019 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంల పనితీరుపై సందేహాన్ని వ్యక్తం చేశారు. తాను పసుపు కుంకుమల డబ్బు వేసినా, పథకాలు అమలు చేసినా, అభివృద్ధి చేసినా ఓడిపోవడానికి ప్రజలు కారణం కాదని, ఈవీఎంలు మాత్రమేనని చంద్రబాబు నాడు తెలిపారు. ఈవీఎంలను తొలగించి వాటి స్థానంలో బ్యాలట్ పత్రాలను పెట్టాలంటూ నాడు టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నాడు ఓటమి పాలయిన చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయడంతో కేవలం 23 స్థానాలు మాత్రమే రావడంతో ఆయనకు ఆ అనుమానం కలిగింది. అందుకే వెంటనే మీడియా సమావేశంలో ఈవీఎంలపై నెపం నెట్టేశారు.
జగన్ ఇప్పుడు...
ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ జగన్ కూడా అదే బాటన నడుస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే తాము బటన్ నొక్కి 2.50 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని, మహిళల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చామని, మహిళలు, లబ్దిదారులు తమకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారు. కానీ ఇంతటి దారుణ ఓటమికి మాత్రం తాను కారణం కాదని, ఈవీఎంలంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పత్రాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలంటూ జగన్ ఇప్పుడు ట్వీట్ చేశారు. 2019 లో గెలిచిన నాడు మాత్రం ఈవీఎంలను పన్నెత్తు మాట అనలేదు.
సందేహాలకు సమాధానం...?
అయితే జగన్ చేసిన ట్వీట్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ ఎలాన్ మస్క్లా మారిపోయాడన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ అన్న మాటలను గుర్తు చేసుకోవాలన్నారు. కానీ సోమిరెడ్డికి తెలియని విషయం ఏంటంటే అదే 2019 ఎన్నికల్లో ఈవీఎంలను చంద్రబాబు వ్యతిరేకించారని. అయితే ఈవీఎంలపై సామాన్య ప్రజల్లో కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ మాత్రం తమకు పట్టనట్లు కూర్చుంటుంది. ఈవీఎంలు గెలుపోటములు శాసిస్తాయా? అంటే అదొక సందేహమే కానీ ఖచ్చితమని చెప్పలేం. కానీ నిపుణులు మాత్రం ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు అవకాశాలున్నాయంటున్నారు. దీనిపై దేశమంతా చర్చ జరగాల్సి ఉంది. అదే సమయంలో జనంలో రేకెత్తుతున్న సందేహాలకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అది దాని బాధ్యత. కానీ ఇప్పుడు చేసేదేమీ లేదు. ఎన్నికలు ముగిశాయి. కేవలం క్యాడర్ ను నిలుపుకునేందుకు ఇలాంటి సాకులు మాత్రం చెప్పుకుని తీరాలి మన నేతలు.
Next Story