Sun Dec 22 2024 23:23:00 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబుకు అంత ఈజీ కాదు... అయినా గుడ్న్యూస్ చెబుతారటగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం ఒక సవాల్ గా మారవచ్చు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం ఒక సవాల్ గా మారవచ్చు. గత ఎన్నికల్లో సీట్లు రాక కొందరు, పొత్తులో భాగంగా తమ స్థానాలను త్యాగాలను చేసిన తమ్ముళ్లు ఇలా చూసుకుంటూ పోతే 175 నియోజకవర్గాల్లో పెద్ద లిస్టే ఉంది. అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవిలో స్థానం దక్కని వారు కూడా తమకు ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేక మంది నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకు దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు.
ఆశావహుల సంఖ్య...
ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో చంద్రబాబు కానీ ఎవరైనా కాని కొందరికే న్యాయం చేసే వీలుంటుంది. అందరికీ పదవులు ఇచ్చేందుకు అవకాశముండదు. ఒకవైపు సామాజికవర్గాల సమీకరణను చూసుకుంటూనే మరొక వైపు పార్టీకోసం కష్టపడిన వారిని విస్మరించకుండా పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది ఆషామాషీ అయిన విషయం కాదు. మంత్రి పదవి దక్కని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తే మిగిలిన వారిలో అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగాలు చేసినా తమకు ఇవ్వకుండా గెలిచిన వారికే మళ్లీ పదవులివ్వడం ఏంటన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది.
ప్రాంతాల వారీగా...
ప్రాంతాల వారీగా కూడా నామినేటెడ్ పోస్టుల్లో చంద్రబాబు న్యాయం చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ పరంగా కూడా చూడాలి. మరోవైపు కూటమి పార్టీలకు కొన్ని నామినేటెడ్ పోస్టులను కేటాయించాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, దుర్గగుడి ఛైర్మన్ పదవులకు మంచి డిమాండ్ ఉంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఏపీఐఐసీ, పీసీబీ, శాప్ వంటి ఛైర్మన్ పదవులకు కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీటీడీ బోర్గు సభ్యులుగా కూడా ఇవ్వాలంటూ ఇప్పటికే కూటమి లోని తమ పార్టీ అగ్రనేతలకు వినతులను అందించారు. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ పదవికి ఒక ఛానల్ యజమాని పేరు ఖరారయిందన్న వార్తలు వస్తున్నాయి. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి కూడా అంతే డిమాండ్ ఉంది.
మిత్ర పక్షాలకు కూడా...
ఇప్పటికే బుద్దా వెంకన్న లాంటి వాళ్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. తమది అసంతృప్తి కాదని, ఆవేదన అంటూనే వెంకన్న ఇటీవల తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు వెళ్లగక్కారు. నామినేటెడ్ పోస్టులలో తమకు వాటా కావాలని జనసేన, బీజేపీ కూడా కోరుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయమై చర్చించారని తెలిసింది. అయితే ఎన్ని పోస్టులు మిత్ర పక్షాలకు ఇస్తారు? ఎన్ని టీడీపీకి ఇస్తారన్నది మాత్రం తెలియరాలేదు. నేడు పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపైనే చర్చ జరగనుంది. వారం రోజుల్లో పోస్టులను భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి చంద్రబాబు ఎవరినీ నొప్పించకుండా ఈ గండం నుంచి ఎలా బయటపడతారన్నది చూడాల్సిందే.
Next Story