Mon Dec 23 2024 04:19:48 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : దొరికినోడికి దొరికినన్ని.. బలమున్నోడిదే ఆహారం.. ఇదీ సహాయక చర్యల పరిస్థితి
విజయవాడ సింగ్ నగర్ వంతెనపైకి ఆహారాన్ని, మంచినీటిని, పాలను అందచేస్తున్నారు. వీటి కోసం తొక్కిసలాట జరుగుతుంది.
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు తగ్గుముఖం పడుతుంది. గత పద్దెనిమిది గంటల్లో దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు తగ్గింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశమే. అమావాస్య ముగియడంతో సముద్రం కృష్ణానది నుంచి వస్తున్న నీటిని నిన్న రాత్రి నుంచి తీసుకోవడం ప్రారంభించింది. దీంతో వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని 70 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో విజయవాడలోని పలు ప్రాంతాల్లో వరద నీరు మాత్రం తగ్గలేదు.
ఘర్షణలకు దిగుతున్న బాధితులు..
సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా పాలు లేక, నీరు అందక, సరైన భోజనం లేక మూడున్నర లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, రోగులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో సింగ్ నగర్ వంతెనపైకి ఆహారాన్ని, మంచినీటిని, పాలను అందచేస్తున్నారు. వీటి కోసం తొక్కిసలాట జరుగుతుంది. బయటకు వెళ్లలేక, ఇక్కడ కూడా కూడా తమకు దొరకకపోతే కుటుంబం ఆకలితో ఇబ్బంది పడుతుందని భావించి ఘర్షణలకు దిగుతున్నారు.
మంత్రుల పర్యటనలతో...
మరోవైపు మంత్రులు, రాజకీయ నాయకుల పర్యటనలతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వీరు పర్యటనలకు, పరామర్శకు వచ్చినప్పుడు వీవీఐపీల ప్రోటోకాల్ కోసం పోలీసులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రూట్ క్లియర్ చేయడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం పోలీసులు ఎక్కువగా శ్రమిస్తున్నారు. సమీక్షల్లో అధికారులు, క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందితో సమన్వయం కుదరడం లేదు. రాజకీయ పరామర్శలకి బ్రేక్ ఇస్తే సహాయ చర్యల్లో వేగం పుంజుకునే అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.
మంత్రులు అలా వచ్చి వెళ్లగానే...
పలు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందికి అందని కమ్యూనికేషన్ రేడియోలు బ్యాటరీలు అయిపోవడంతో క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం అందడం లేదు.నగరంలోని పలు ప్రాంతాల్లో కేటాయించిన విధుల్లో సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. మూడు రోజుల నుంచి వారు పనిచేసి అలసి పోయారు. కాకుంటే వీవీఐపీలు వచ్చినప్పుడు మాత్రం అక్కడ కనిపించి తర్వాత రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆహార పదార్థాల పంపిణీ చేయడం కష్టంగా మారింది. బాధితులు ఒక్కొక్కరూ రెండు, మూడు సార్లు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. దొరికిన వాడికి దొరికినట్లు. లేని వాడికి లేనట్లుగా తయారైంది పరిస్థితి.
Next Story