Fri Nov 08 2024 10:11:01 GMT+0000 (Coordinated Universal Time)
ఇక వైసీపీ నేత చేరికకు బ్రేకులు పడినట్లేనా? ఫ్యాన్ పార్టీలోనే ఉండిపోతారా?
మూడు రోజులుగా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుగుతున్నాయి.
గత మూడు రోజులుగా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు ఆయన వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలోనూ ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దయెత్తున ఆదాయపు పన్ను మొత్తాన్ని ఎగవేశారన్న ఆరోపణలపై గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు భీమవరం, సింగరాయకొండలోని ఆయన కంపెనీల్లోనూ ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రంథి శ్రీనివాస్ కు రొయ్యల చెరువులున్నాయి. రొయ్యల ఎగుమతుల వ్యాపారాలున్నాయి. ఈ వ్యాపారానికి సంబంధించి ఆదాయపు పన్ను మొత్తాన్ని చెల్లించలేదన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
వైసీపీని వీడతారని...
మరొక వైపు గ్రంథిశ్రీనివాస్ ఇటీవల వైసీపీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన బీజేపీ లేదా టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద గెలిచిన గ్రంథి శ్రీనివాస్ కాపు సామాజికవర్గం నేత. పవన్ కల్యాణ్ ఓడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు నాడు మార్మోగింది. జెయింట్ కిల్లర్ గా మారిపోయారు. అయితే 20224 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అదే జనసేన అభ్యర్థి చేతిలో భీమవరం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఆయన జనసేనలో చేరేందుకు ఇష్టపడరు. అందుకే కూటమిలోని ఇతర పార్టీలైన బీజేపీ, టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది.
మూడు రోజులుగా...
అయితే గత మూడు రోజులుగా జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖల సోదాల నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలిసింది. ఏ కారణంతోనైతే తాను పార్టీ మారాలనుకున్నారో? అదే ఇప్పుడు జరుగుతుండటంతో ఇక పార్టీ మారి నిష్ప్రయోజనమని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అయితే గ్రంథి శ్రీనివాస్ తాను పార్టీ మారుతున్నట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించడం లేదు. అలాగని వైసీపీలోనూ యాక్టివ్ గా కనిపించడం లేదు. అయితే ఈ ఐటీ దాడుల తర్వాత ఆయన వైసీపీలో యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయని గ్రంథి శ్రీనివాస్ సన్నిహితులు చెబుతున్నారు. అదే సమయంలో జగన్ ను కూడా కలిసేందుకు గ్రంథి శ్రీనివాస్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. ఐటీ దాడుల వల్లనే తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలియవచ్చింది.
Next Story