Mon Dec 23 2024 03:38:00 GMT+0000 (Coordinated Universal Time)
Nallari Kiran Kumar Reddy : ఈయనేందయ్యా ..బాబూ.... జిల్లాలను కలిపేస్తానంటున్నాడు... అందుకేగా?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాను సీఎంను అయి ఉంటే జిల్లాలను కలిపేసి ఉండేవాడినని,జిల్లాలను విభజించి గత ప్రభుత్వం తప్పు చేసిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలను కొత్త వాటిని ఎందుకు చేస్తారో తెలుసా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరిచిపోయినట్లున్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే జిల్లాలను మళ్లీ కలిపేసి ఉండేవాడినన్న ఆయన కామెంట్స్ కు గట్టిగానే సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
ఎంపీగా కూడా...
ముఖ్యమంత్రి సంగతి పక్కన పెట్టు.. కనీసం పార్లమెంటు సభ్యుడిగా కూడా ప్రజలు ఎన్నుకోలేదుగా అన్న వ్యాఖ్యలు కనపడుతున్నాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కూటమి తరుపున రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఆయన ఉన్నట్లు కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించడం చూస్తే తన ఓటమికి కారణం కొత్త జిల్లాల ఏర్పాటే కారణమని ఆయన భావిస్తున్నట్లుంది. జిల్లాలుగా విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తాను ఓటమి పాలు కావడానికి ఇన్ని జిల్లాల ఏర్పాటు మరొక కారణమని ఆయన అనుకుంటున్నట్లుంది.
ఓటమి నుంచి...
ఇలా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కామెంట్స్ ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి. నల్లారి ఫేడ్ అవుట్ అయిన నేత. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. దీంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆదరించే పరిస్థిితి లేదు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఈయన మాత్రం బీజేపీలో చేరి కూటమి తరుపున పోటీ చేసినా రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ షాక్ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా తేరుకోలేకపోతున్నారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త జిల్లాల వల్ల ప్రజలకు కలిగే నష్టం ఏంటి? ఈయనకు వ్యక్తిగత నష్టమేనని ఎద్దేవా చేస్తున్నారు.
జనానికి దూరంగా....
తాను సీఎం అయితే విడగొట్టిన జిల్లాలను కలిపి ఉండేవాడినన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కసితో చేసినవే అంటున్నారు. అంత సీన్ లేదు బాసూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. నల్లారి ఎంత గింజుకున్నా ఆయనకు తిరిగి పూర్వ వైభవం తిరిగి వచ్చేది కష్టమేనంటున్నారు. ఎందుకంటే జనానికి దూరంగా ఉండే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి తనను గెలిపించాలని కోరడం కూడా ఆయనను ప్రజలు ఆదరించకపోవడానికి కారణంగా చెబుతున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మతి భ్రమించి వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు పెద్దయెత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. మొత్తం నల్లారి ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు అన్నది మాత్రం ఆయనకే తెలియాల్సి ఉంది.
Next Story