Wed Dec 18 2024 14:26:46 GMT+0000 (Coordinated Universal Time)
Alla Nani : అటూ ఇటూ కాకుండా పోయినట్లేనా.. ఆళ్ల నానికి అడ్డం పడిందెవరు?
మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరికకు బ్రేకులు పడ్డాయి.
మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరికకు బ్రేకులు పడ్డాయి. ఏలూరు జిల్లా టీడీపీ నేతలు ఆళ్ల నాని పార్టీలో చేరికపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ ఆళ్ల నాని పార్టీలో చేరడానికి తాము ఒప్పుకోమంటూ అధినాయకత్వానికి తెగేసి చెబుతున్నారట. దీంతో మొన్న పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కండువా కప్పుకోవాల్సిన ఆళ్లనానికి హైకమాండ్ తలుపులు మూసేసింది. ఇప్పుడు కాదంటూ సమాచారం పంపింది. దీంతో ఆళ్ల నాని ఇటు వైసీపీకి, అటు టీడీపీకి కాకుండా పోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైకమాండ్ ఊహించని రీతిలో నియోజకవర్గం నుంచి కాకుండా జిల్లా నుంచి కూడా ఆళ్ల నాని చేరికపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
వైసీపీ లో ప్రయారిటీ ఇచ్చినా....
నిజానికి కి ఆళ్లనానికి ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంచి పదవులే లభించాయి. అసలు ఆళ్లనానిని ఎమ్మెల్సీ చేసింది జగన్. తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను అప్పగించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అప్పగించారు. రెండో విడత విస్తరణలో మాత్రం ఆళ్ల నాని మంత్రి పదవిని కొనసాగించకపోవడంతో కొంత అసంతృప్తికి గురయ్యారు. అయితే ఆళ్ల నానికి మాత్రమే కాదు సీనియర్ నేతలైన పేర్నినాని, కొడాలి నానిలను కూడా రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో కేబినెట్ నుంచి తప్పించిన విషయాన్ని ఆళ్లనానిమర్చిపోయినట్లుంది. కానీ తనకే అన్యాయం వైసీపీలో జరిగిందన్న భ్రమలో ఉన్నారు.
టీడీపీ కార్యకర్తలపై...
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ల నానికి ఏలూరు జిల్లాలో కూడా కీలక బాధ్యతలను జగన్ అప్పగించారు. కాపు సామాజికవర్గం నేత కావడంతో మంచి ప్రయారిటీ ఇచ్చారు. అయితే అదే అదనుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టించడంలో ఆళ్ల నాని అత్యుత్సాహం చూపించారు. అనేక విషయాల్లో టీడీపీని జిల్లాలోనూ, ఏలూరు నియోజకవర్గంలోనూ బలహీన పర్చడానికి ప్రయత్నించారు. అవేఇప్పడు ఆళ్ల నానికి శాపాలుగా మారాయి. ఇప్పుడు టీడీపీ నేతలంతా ఒక్కటయ్యారు. మూకుమ్మడిగా ఆళ్ల నాని టీడీపీలో చేరికను వ్యతిరేకిస్తూ అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో నాయకత్వం కూడా ఆళ్ల నాని చేర్చుకోవడంపై పునరాలోచనలో పడిందంటున్నారు.
అవసరం లేకపోయినా...
నిజానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్ల నాని అవసరం టీడీపీకి లేదు. సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. కాపు సామాజికవర్గ నేతలతో పాటు అనుభవమున్న లీడర్లు కూడా అక్కడ ఎన్నాళ్ల నుంచో ఉన్నారు. పార్టీ జెండాను ఏళ్ల తరబడి పట్టుకుని తిరుగుతున్న వారిని కాదని ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకుంటే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన సహజంగా వారిలో వ్యక్తమవుతుంది. అందుకే ఆళ్ల నాని చేరికకు అడ్డంపడుతున్నారు. ఆయన చేరికతో పార్టీకి బలం చేకూరకపోగా ఉన్న వారిలో నైరాశ్యం అలుముకుంటుందన్న భావన ఇటు హైకమాండ్ లోనూ వ్యక్తమవుతుంది. అందువల్లనే ఆళ్లనానిని చేర్చుకోవాలని తొలుత భావించిన పార్టీ అధినాయకత్వం నేతలలో కనిపించిన వ్యతిరేకతతో కొంత వెనక్కు తగ్గినట్లే కనిపిస్తుంది. దీంతో నాని పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా ఉంది.
Next Story