Fri Mar 28 2025 21:21:15 GMT+0000 (Coordinated Universal Time)
Balineni : వైసీపీలోకి మళ్లీ బాలినేని వస్తారా? జనసేనలో ఇమడలేకపోతున్నారా?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజకీయంగా పునరాలోచనలో పడినట్లు తెలిసింది

వైసీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజకీయంగా పునరాలోచనలో పడినట్లు తెలిసింది. 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిన తర్వాత బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనలో చేరిన తర్వాత తనకు ప్రాధాన్యత దక్కుతుందని బాలినేని భావించారు. కానీ పెద్దగా ప్రయారిటీ దక్కకపోవడంపై ఇటీవల ఆయన తన సన్నిహితులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవి కూడా తాను సూచించిన వారికి ఇవ్వకపోడంపై బాలినేని శ్రీనివాసులు రెడ్డి కొంత మనస్థాపానికి గురయ్యారని చెబుతున్నారు. ఇటీవల వైసీపీకిచెందిన కార్పొరేటర్లను జనసేనలో చేర్చినప్పటికీ తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన మనస్తాపానికి గురయినట్లు తెలిసింది
ఐదుసార్లు గెలిచి...
బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్, తర్వాత వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఒంగోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009, 2012, 2019 ఎన్నికలలో ఆయన ఒంగోలు నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటుతో 2014 ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూశారు. కానీ ఈవీఎంలలో తేడా ఉందని ఆయన ఎన్నికల కమిషన్ ను, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో వైసీపీ పార్టీ నాయకత్వం తనకు అండగా నిలబడలేదన్న అసంతృప్తితో బాలినేని ఉన్నారు. మరొక వైపు మంత్రివర్గ విస్తరణలో తనను తొలగించడంపై కూడా బాలినేని శ్రీనివాసులు రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీలో ఉన్న అసంతృప్తితో...
అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆయనకు తన బంధువు వైవీ సుబ్బారెడ్డి నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. జగన్ వద్ద వైవీకి ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఆయన తట్టుకోలేకపోయారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు వారిస్తున్నా ఆయన వినకుండా వైసీపీని వదిలి వెళ్లారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడటంతో జగన్ కు కొంత ఇబ్బంది అయినప్పటికీ ఆయనను ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఆ కోపం మీద జనసేనలో చేరారు. కానీ జనసేనలోనూ తన మాట చెల్లుబాటు కాకపోవడం, జిల్లాలోనూ, ఒంగోలు నియోజకవర్గంలోనూ ఎవరూ తనను పట్టించుకోవడం లేదన్న బాధ బాలినేనిలో కనపడుతుంది.
బయటకు వచ్చేందుకు...
అయితే జనసేన నుంచి బయటకు వచ్చేందుకు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఇప్పట్లో ప్రయత్నించకపోవచ్చు. ఇంకా ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉండటంతో తాను బయటకు వచ్చినా ప్రయోజనం ఉండదని ఆయనకు తెలుసు. అదే సమయంలో జనసేన లో ఉంటే కొంత సేఫ్ గా ఉంటానని బాలినేని భావిస్తుండవచ్చు. బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై ఇప్పటికే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కత్తులు నూరుతున్నారు. ఆయన నుంచి తనతో పాటు క్యాడర్ ను కాపాడుకోవాలంటే జనసేన లో కొన్నాళ్లు కాలం వెళ్లదీయక తప్పదని సన్నిహితుల వద్ద బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పినట్లు తెలిసింది. అయితే ఆయన వైసీపీలో మళ్లీ చేరతారన్న ప్రచారం మాత్రం ఒంగోలులో ఊపందుకుంది. కానీ కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత మాత్రమే బాలినేని నిర్ణయంతీసుకునే అవకాశముందనిఆయనసన్నిహిుతుల తెలిపారు.
Next Story