Mon Dec 23 2024 13:30:58 GMT+0000 (Coordinated Universal Time)
Akhila Priya : అఖిలా యాటిట్యూడ్ మార్చుకో తల్లీ... లేకుంటే ఇబ్బందులే
మాజీమంత్రి అఖిలప్రియ ఎప్పుడూ వివాదంలో చిక్కుకునే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు అంతే. లేనప్పుడు అంతే.
మాజీమంత్రి అఖిలప్రియ ఎప్పుడూ వివాదంలో చిక్కుకునే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు అంతే. లేనప్పుడు అంతే. తండ్రి, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన రాజకీయాలను అందిపుచ్చుకుందే కానీ వారి కలివిడితనం, వారు అనుచరులు, బంధువులతో మెలిగినట్లు అఖిలప్రియ వ్యవహరించడం లేదు. అంతా నా ఇష్టం అన్న రీతిలో వ్యవహరించడం పార్టీకి కూడా తలనొప్పిగా మారింది. ఆమెకు మొన్నటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన వారు సయితం అఖిలప్రియ వ్యవహారశైలిలో విసిగి పోయి ఉన్నారు. సొంత బంధువులను కూడా అఖిలప్రియ స్పేర్ చేయడం లేదు. దీంతో ఆమె పరిస్థితిపై ఇటు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.
తల్లి మరణంతో...
అఖిలప్రియ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు. 2014లో తల్లి మరణంతో ఆమె రాజకీయాల్లోకి చిన్న వయసులో అడుగు పెట్టారు. వెంటనే ఏకగ్రీవంగా ఆళ్లగడ్డకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి ఆమె టీడీపీలో చేరారు. అదృష్టం తలుపు తట్టినట్లుగా వెంటనే అఖిలప్రియను మంత్రి పదవి వరించింది. ఇక చూస్తోండి... ఆమె నియోజకవర్గంలో తన తడాఖా చూపించడం మొదలుపెట్టారు. భూమా నాగిరెడ్డి సన్నిహితులందరినీ దూరం చేసుకున్నారు. మంత్రి పదవిలో ఉండి ఆధిపత్యం కోసం పాకులాడటంతో బంధువర్గమూ ఆమెకు దూరమయింది. దీంతో భూమా అఖిల కుటుంబం ఒంటరి అయినట్లే కనిపిించింది.
మొదటి సారి...
2019 ఎన్నికల్లో తమ కుటుంబ ప్రత్యర్థి గంగుల కుటుంబం చేతిలో అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. అప్పుడు కూడా ఆమెలో మార్పు రాలేదు. ఈలోపు వివాహం అయిన ఆమెకు భర్త తోడయ్యారు. ఇంకేముంది అగ్గికి ఆజ్యం పోసినట్లు సీన్ ఛేంజ్ అయింది. ఇక భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని కూడా దూరం చేసుకున్నారు. బంధుత్వం లేకపోయినా చిన్న నాటి నుంచి మామా అని పిలచే ఏవీతో వైరాన్ని పెట్టుకున్నారు. ఆస్తుల వివాదమే కారణమని చెబుతున్నప్పటికీ, ఆధిపత్య పోరు కోసమేనన్నది అఖిలప్రియను దగ్గర నుంచి చూసిన వాళ్లు చేస్తున్న కామెంట్స్. ఏవీతో వైరం చివరకు హత్యలు చేసుకునే వరకూ వెళ్లింది. ఏవీ సుబ్బారెడ్డితో నువ్వా? నేనా? అన్న రీతిలో యుద్ధాన్ని ప్రకటించుకున్నారు. కూటమికి బలంగా గాలి వీచిన నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో మొదటి సారి ఎమ్మెల్యేగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందంటూ ప్రత్యర్థులను బెదిరించే ప్రయత్నం చేశారు.
సొంత మేనమామతో...
తాజాగా అఖిలప్రియ మేనమామ ఎస్.వి. జగన్ తోనూ వైరం కొని తెచ్చుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి విజయ డెయిరీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన ఆఫీసుకు వెళ్లి అక్కడ ఆఫీసులో ఆయన కుర్చీలో కూర్చుని సొంత మామకే సవాల్ విసిరారు. ఇది కుటుంబ వైరం కాస్తా ఆయనకు సానుభూతిగా మారింది. అఖిలప్రియ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైఎస్ జగన్ ఫొటోను తొలగించి చంద్రబాబు ఫొటోను తానే స్వయంగా పెట్టారు. అంత వరకూ ఓకే గాని పెద్దాయన అని గౌరవం లేకుండా, వయసును చూసి కూడా అఖిలప్రియ విలువ ఇవ్వలేదని ఆ ప్రాంతంలో బలంగా టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ లో రానివ్వ వద్దంటూ పోలీసులను ఆదేశించడం కూడా వివాదంగా మారింది. ఇలాగే కొనసాగితే అఖిలప్రియ ఈ ఐదేళ్లు ఓకే.. తర్వాత ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న హెచ్చరికలు బాగానే సౌండ్ చేస్తున్నాయి.
Next Story