Fri Nov 22 2024 19:08:41 GMT+0000 (Coordinated Universal Time)
రైతుల పాదయాత్రపై ఈ దండయాత్ర ఏంటి?
రైతుల పాదయాత్రపై ప్రభుత్వం దండయాత్ర చేయడం సరికాదని మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు
రైతుల పాదయాత్రపై ప్రభుత్వం దండయాత్ర చేయడం సరికాదని మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. మంత్రులే రెచ్చగొడుతున్నారన్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులను కొందరిని మారుస్తామని లీకులు ఇవ్వడంతో ఈ దండయాత్ర మొదలు పెట్టారని కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర నేతలు గతంలో ఏం మాట్లాడారు? ఈరోజు ఏం మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విడగొట్టాలని వైసీపీ మంత్రులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే...
ఈ దండయాత్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే జరుగుతుందన్నారు. ప్రశాంతంగా ఉండే ఉత్తరాంద్ర చిక్కుల్లో పడే అవకాశముందని చెప్పారు. ప్రజలు ఆలోచించాలని కోరారు. అభివృద్ధి ఈ మూడున్నరేళ్లలో ఏమీ లేదని, సంక్షేమం కూడా ఉత్తుత్తిదేనని ఆయన అన్నారు. మూడు రాజధానుల పేరుతో మంత్రులను ఉసిగొల్పి సమస్యలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. పదవులు ఊడిపోతాయనే మంత్రులు ఈ విధమైన చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. మూడేళ్ల నుంచి గిరిజన యూనివర్సిటీ ఏమయిందని ఆయన ప్రశ్నించారు. జీవో నెంబరు 3ని పట్టించుకున్నారా? అని నిలదీశారు. ఐటీడీఏకి ఎంతమేరకు నిధులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
Next Story