Mon Dec 23 2024 01:15:25 GMT+0000 (Coordinated Universal Time)
మీ నాన్నారు దొరికిపోయారు లోకేష్ : పేర్ని నాని
ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారని లోకేష్ను మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు
ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారని లోకేష్ను మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య అని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో పెద్ద యెత్తున అవినీతి జరిగిందని అందరికీ తెలుసునని చెప్పారు. 25 రోజులు ఢిల్లీలో ఉండి ఏం చేసి వచ్చావ్ అని లోకేష్ ను పేర్ని నాని నిలదీశారు. సీమన్స్ కంపెనీ నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్లావా? అని ఎద్దేవా చేశారు. సీమెన్స్ ఇస్తామన్న డబ్బులు ఎక్కడని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ అకౌంట్లో 27 కోట్లు...
స్కామ్ లో 27 కోట్ల రూపాయలు టీడీపీ అకౌంట్లో వేసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. తమిళనాడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ మూడు, నాలుగు దశాబ్దాల పాటు తప్పించుకు తిరిగినా వీరప్పన్ ఒక్కసారే దొరికాడని అన్నారు. ఢిల్లీలో వేసిన వేషాలు ఇక్కడ వేయొద్దని అన్నారు. మీ నాన్నారు దొరికారు కాబట్టి జైల్లోకి వెళ్లారన్నారు. డబ్బా మాటలు ఇక్కడ చెల్లవని అన్నారు. దొరికినంత మాత్రాన దొంగకాకుండా పోరని ఆయన అన్నారు. మీ కుటుంబమే నీతిమంతమైతే, 1995లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇప్పటి దాకా కోర్టు మానిటర్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.
ఓర్నీ వేషాలో...
జగన్ కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. పవన్ కల్యాణ్ లాగా చంద్రబాబు కోసం పూటకోమాట, రోజుకో వేషం, రోజుకో పార్టీని మార్చే వ్యక్తి కాదని అన్నారు. పవన్ ఐదురోజుల వారాహి యాత్ర ఆటవిడుపుగా సాగిందన్నారు. పవన్ చేస్తున్న కామెంట్స్ జనసేన కార్యకర్తలకు కూడా నచ్చడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదిరించానని, నువ్వెంత అని అంటున్న పవన్ ఓర్నీ వేషాలో అంటూ సెటైర్ వేశారు. వైఎస్ మీద ఎక్కడ పోరాటం చేశావో చెప్పాలన్నారు. ఇది సినిమా కాదని, రాజకీయం అని తెలుసుకోవాలని పవన్ కు సూచించారు.
Next Story