Fri Apr 18 2025 14:04:02 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : సాయిరెడ్డికి పదవి ఖాయమయిందటగా
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లుంది

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారా? అంటే అవుననే అంటున్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చూసుకుంటానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కర్ణాటకలో తన వ్యవసాయ క్షేత్రంలో ఫొటోలను కూడా పోస్టు చేశారు. అసలు వైసీపీలో నెంబరు టూ గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కారణమే మిస్టరీగా మారింది. 2014లో ఓటమి పాలయిన తర్వాత దగ్గర నుంచి 2024 పార్టీ ఓటమి పాలయ్యేంత వరకూ జగన్ ను అంటిపెట్టుకుని, పార్టీలో ఆధిపత్యం ప్రదర్శించిన సాయిరెడ్డి ఉన్నట్లుండి తీసుకున్న నిర్ణయం అప్పట్లో చర్చగా మారింది.
రాజీనామా చేసిన తర్వాత...
బీజేపీలో చేరతారని ప్రచారం పెద్దయెత్తున జరిగినప్పటికీ ఆయన దానిని ఖండించారు. తాను రాజకీయాల జోలికి రానని కూడా తేల్చి చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేసింది గవర్నర్ పదవి కోసమేనంటూ అప్పుడే పెద్దయెత్తున క్యాంపెయిన్ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా వత్తిడుల కారణంగానే సాయిరెడ్డి రాజీనామా చేసి ఉంటారని, ఒత్తిడులకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ఉండాలని, అప్పుడే రాజకీయాలు చేయాలని కూడా జగన్ అన్నారు. తర్వాత విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిల ను కూడా కలవడం చర్చనీయాంశమైంది. వైఎస్ షర్మిలపై తాను చేసిన విమర్శలకు వివరణ ఇచ్చుకునేందుకే ఆయన వెళ్లారని చెప్పినా, తర్వాత సాయిరెడ్డి అన్న వ్యాఖ్యలను షర్మిల రివీల్ చేయడంతో ఆయన ఇక వైసీపీ వైపు చూడరని కూడా అర్ధమయింది.
కొన్ని రోజులుగా సైలెంట్ గా...
కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ థన్ ఖడ్ ను ఎయిర్ పోర్టులో ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉండి రిజైన్ చేసిన సాయిరెడ్డి జగదీప్ థన్ ఖడ్ వద్దకు వచ్చారని భావించినా, సాధారణ కలయిక మాత్రం అనుకోలేమంటున్నారు. భవిష్యత్ లో తనకు గవర్నర్ పదవి వస్తుందని భావించే విజయసాయిరెడ్డి ఉప రాష్ట్రపతిని కలిశారని కూడా అంటున్నారు. ఆయన బీజేపీలో చేరి గవర్నర్ పదవి పొందడం ఖాయమని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా జూన్ నెలలో బీజీేపీలో చేరడంతో పాటు వెంటనే గవర్నర్ పదవి ఇస్తామన్న ఒప్పందంతోనే ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారంటున్నారు.
సాయిరెడ్డి మాత్రం...
బీజేపీ నేతలతో గత పదేళ్లుగా ఉన్న పరిచయాలు మాత్రమే విజయసాయిరెడ్డి ఈనిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. జగన్ ను బలహీనం చేయడమే కాకుండా రాజ్యసభలో తమ బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే సాయిరెడ్డి రాజీనామా చేశారని, ఆయన గవర్నర్ గా ఏ రాష్ట్రానికి వెళతారన్నది మాత్రమే ఇప్పుడు చర్చ జరుగుతుందని, దాదాపు రాజ్ భవన్ కు వెళ్లడం ఖాయమైపోయిందన్న ప్రచారం హస్తినలో జోరుగా సాగుతుంది. సాయిరెడ్డి మాత్రం తాను మామూలుగానే కలిశానని, కొన్నేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరిచయం కారణంగానే ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చానని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story