Tue Apr 08 2025 17:25:18 GMT+0000 (Coordinated Universal Time)
వైవీని ఇరికించినట్లేనా?

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ కోటరీ ఉందని వ్యాఖ్యానించారు. నిజానికి సాయిరెడ్డి నోటి నుంచి ఈ మాటలు రావడంతో ఎవరు ఆ కోటరీ అన్న దానిపై వైసీపీలోనే చర్చ జరుగుతుంది. కోటరీలో ముఖ్యంగా వైవీసుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారన్నది ఆయన చెప్పకనే తెలిసింది. జగన్ ను కలవాలంటే కోటరీని దాటుకుని వెళ్లాల్సిందేనని తెలిపారు. జగన్ చెప్పుడు మాటలు విన్నారని చెప్పినా అది వైవీ సుబ్బారెడ్డి గురించేనని పరోక్షంగా సాయిరెడ్డి చెప్పినట్లయింది. తనను ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించడానికి కూడా వైవీయే కారణమని ఆయన అభిప్రాయంగా తెలుస్తుంది. ఆయన వల్లనే తాను దూరమయ్యాయని చెప్పకనే చెప్పారు.
విక్రాంత్ రెడ్డిని ఇరికించే యత్నమా?
మరోవైపు కాకినాడ సీపోర్టు విషయంలో వైవీ కుటుంబాన్ని కూడా సాయిరెడ్డి ఇరికించే ప్రయత్నం చేసినట్లే కనిపిస్తుంది. తనకు తెలిసినంత వరకూ కేవీరావు, శరత్ చంద్రారెడ్డికి మధ్య డీల్ సెట్ చేసింది వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంతి రెడ్డి అని ఆయన అనడం ఇందుకు ఉదాహరణ మాత్రమే. వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయిన నాటి నుంచే సాయిరెడ్డికి హస్తినలో ప్రాబల్యం తగ్గడంతో ఆయనను జగన్ పక్కన పెట్టారన్న ఫీలింగ్ లో విజయసాయిరెడ్డి ఉన్నట్లే కనిపించారు. ఇలా వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనపై లేనిపోనివి చెప్పి జగన్ మనసును మార్చారని, అందుకే జగన్ మనసులో తాను లేరని ఆయన అన్నట్లు అర్ధమవుతుంది.
వైవీ ఎన్నికయిన తర్వాత...
వైవీసుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన తర్వాతనే అనూహ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ విమర్శలకు కొంత ఊతమిచ్చినట్లయింది. దాదాపు పదేళ్ల పాటు ఢిల్లీలో తన మాట చెల్లుబాటు కావడం, వైవీ ఎన్నికతో తన ప్రాధాన్యత తగ్గడంతో సాయిరెడ్డి జీర్ణించుకోలేకపోయారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ తిరిగి ఉత్తరాంధ్ర కు విజయసాయిరెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు పార్టీని వీడిన తర్వాత కోటరీ అంటూ లేని పోని ఆరోపణలు చేయడం మినహా అందుకు తగిన ఆధారాలు చూపాలంటూ వైసీపీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. నాయకుడు అన్న తర్వాత ఎవరో ఒకరిని నమ్మాలని, ఎవరినీ నమ్మకుండా, ఎవరికీ బాధ్యతలు అప్పగించకుండా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.
Next Story