Mon Dec 15 2025 06:30:25 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : కేశినేని నాని పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. కేశినేని నాని గతంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసిన కేశినాని తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆతర్వాత ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి కేశినేని నాని రాజకీయంగా యాక్టివ్ అవుతారని విజయవాడలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయన సన్నిహితులు తరచూ వచ్చి కలుస్తుండటంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
విజయవాడ అంటే...
అయితే తనకు విజయవాడ అంటే ప్రేమ అని పిచ్చి అని కేశినేని నాని తెలిపారు. విజయవాడ అంటే ప్రేమతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సేవ చేయడానికి ముందుంటానని తెలిపారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ ను పూర్తి చేయడంలో తాను నాడు చేసిన కృషి అందరికీ తెలిసే ఉంటుందని తెలిపారు. ఇటీవల మీడియా ఊహాగానాలకు ప్రతిస్పందనగా తన రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి కేశినేని వైఖరిని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తాను అధికారికంగా ప్రకటించానని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. అనవసరపు ప్రచారాలను నమ్మవద్దని తన అభిమానులకు ఆయన తెలిపారు.
ప్రజా సేవ చేయడానికి...
అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నానన్న కేశినేని నాని ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని, కానీ విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సు కోసం లోతైన అంకితభావంతో ముడిపడి ఉందని కేశినేని నాని చెప్పుకొచ్చారు. తన రాజకీయ పునరాగమనానికి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను విస్మరించమని తాను అందరినీ కోరుతున్నానని తెలిపారు.
Next Story

