Thu Dec 19 2024 12:24:07 GMT+0000 (Coordinated Universal Time)
Botsa Satyanarayana : సత్తిబాబుకు అదృష్టం అలా కలసి వచ్చిందంతే? గ్యాప్ రాకుండా లక్కీ ఛాన్స్ వచ్చేసిందిగా?
బొత్స సత్యనారాయణకు అదృష్టం తలుపు తట్టింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక లాంఛనమే
బొత్స సత్యనారాయణ సీనియర్ నేత. ఆయన ఇప్పటికి రెండు సార్లు మాత్రమే చీపురుపల్లిలో ఓటమి పాలయ్యారు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిన ఏకైక కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ మాత్రమే. మళ్లీ కూటమి వేవ్ లో 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్రలో పట్టున్న నేతగా సత్తిబాబుకు పేరుంది. సామాజికపరంగా, ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఆయన తిరుగులేని రాజకీయం ఉత్తరాంధ్రలో చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు గెలవగా, ఈసారి ఎన్నికల్లో నలుగురు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మూడేళ్ల పాటు...
అలాంటిది బొత్స సత్యనారాయణకు అదృష్టం తలుపు తట్టింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గతంలో గెలిచిన వంశీ కృష్ణయాదవ్ జనసేనలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. మూడేళ్ల పదవీకాలం ఉన్న పోస్టుకు పోటీ చేయడానికి ఉత్తరాంధ్ర నేతలు అనేక మంది పోటీ పడ్డారు. ఎందుకంటే వైసీపీకి స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ఎక్కువగా ఉండటమే. మొత్తం 850 ఓట్లుంటే అందులో 550 ఓట్లు వైసీపీకి ఉన్నాయి. టీడీపీకి 250కి మించి లేవు. అందుకే వైసీపీ నేతలు అనేక మంది పోటీపడినా చివరకు జగన్ బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు.
హార్స్ రైడింగ్ జరుగుతుందని...
హార్స్ రైడింగ్ జరుగుతుందని భావించిన వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో బలమైన నేత బొత్స సత్యనారాయణ బరిలోకి దింపారు. ఎందుకంటే తమకు అత్యధికంగా బలం ఉన్నప్పటికీ వేరే నేతలు అయితే వారిని క్యాంప్ లకు తరలించడం, అధికార పార్టీని ఆర్థికంగా ఈ ఎన్నికను ఎదుర్కొనడం అంత సులువు కాదని జగన్ కు తెలియంది కాదు. అందుకే ఖర్చు పెట్టుకునే బొత్స సత్యనారాయణ అయితే కరెక్ట్ గా ఫిట్ అవుతారని భావించి ఆయన పేరుకు ఓకే చెప్పారు. బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కాగానే అధికార పార్టీ కూడా కొంత డైలమాలో పడింది. సత్తిబాబు ప్రత్యేక వ్యూహంతో ఈ ఎన్నికలో వెళ్లేందుకు ముందు నుంచి స్కెచ్ వేశారు.
టీడీపీ తప్పుకోవడంతో...
ఓటర్లను క్యాంప్ లకు తరలించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమే. ఈ నెల 12వ తేదీన బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ ఎన్నిక కోసం బొత్స తో పాటు మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ నుంచి ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదు. అధికారుల స్క్రూటినీ జరిగిన తర్వాత ఇండిపెండెంట్ బరిలో ఉంటారా? లేదా? అన్నది తెలియనుంది. కానీ అధికార పార్టీ తప్పుకోవడంతో బొత్స సత్యనారాయణ రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది.
Next Story