Fri Nov 22 2024 21:25:25 GMT+0000 (Coordinated Universal Time)
పిడుగుపాటుకు నలుగురి మృతి
వివాహ వేడుకకు వచ్చిన బంధువల్లో కొందరు ఉక్కపోతగా ఉందని సమీపంలోని చెట్టువద్దకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో..
ఏపీలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క విపరీతమైన ఉక్కపోతతో ఎండలు కాస్తుంటే.. మరో పక్క కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురవగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. కర్నూల్ జిల్లా హాలహర్వి మండలం బలగోటలో వివాహ వేడుకకు వచ్చిన బంధువల్లో కొందరు ఉక్కపోతగా ఉందని సమీపంలోని చెట్టువద్దకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలై.. వారంతా కూర్చుని ఉన్న చెట్టుపై పిడుగు పడింది. కర్ణాటకకు చెందిన బసవరాజ్ గౌడ్(30), ఉత్నూరుకు చెందిన శేఖర్ గౌడ్ (31) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
అలాగే కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన రైతు మాలదాసరి ఈరేష్ (38) గురువారం భార్య రత్నమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లారు. కాసేపటికి వర్షం పడుతుండటంతో తడవకుండా ఉండేందుకు సమీపంలోని చెట్టుకిందకు వెళ్లారు. అప్పుడే ఆ చెట్టుపై పిడుగు పడటంతో ఈరేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్యకు గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమలదిన్నెలో చక్రవర్తి (20) అనే యువకుడిపై పిడుగుపడటంతో మరణించాడు. వర్షాలు కురిసే సమయంలో రైతులు, ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.
Next Story