Fri Nov 15 2024 21:40:23 GMT+0000 (Coordinated Universal Time)
Raghu Rama Krishna Raju : రాజుగారి రూటే వేరు.. అందరిదీ ఒక దారి అయితే.. ఆయనది మాత్రం?
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల సేకరణ పార్టీలో చర్చగా మారింది
కనుమూరి రఘురామకృష్ణరాజు పరిచయం అక్కరలేని పేరు. నరసాపురం ఎంపీగా ఆయన 2019 నుంచి 2023 వరకూ వైసీపీలోనే ఉండి ఆ పార్టీకే కంట్లో నలుసుగా మారారు. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ పార్టీపైన, అధినేత జగన్ పైన విమర్శలు చేసే రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో నరసాపురం టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఆ సీటు కూటమిలో పొత్తులో భాగంగా బీజేపీ ఎగరేసుకుపోయింది. ఇక రాజును కాదనలేక, బయట ఉంచలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరీ ఆయనకు ఉండి శాసనసభ టిక్కెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంతో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉండి అభివృద్ధికి...
కూటమి అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్న రఘురామకృష్ణరాజుకు చివరకు నిరాశ ఎదురయింది. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. స్పీకర్ పదవి అయినా దక్కుతుందని భావించినా అది కూడా అయ్యన్నపాత్రుడికి దక్కింది. దీంతో రఘురామకృష్ణరాజుకు మంత్రివర్గంలో ఇక తనకు స్థానం దక్కదని తేలిపోయింది. అయినా ఆయన ఉండిలో తనకంటూ ప్రత్యేకతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిధుల పైన ఆధారపడకుండా నిధుల సేకరణను ఆయన సమీకరిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇది ఇబ్బంది కరంగా మారింది. రఘురామకృష్ణరాజుకు పారిశ్రామికవేత్తలు, సినీ పెద్దలతో ఉన్న సంబంధాలతో వారంతా నిధులు ఇస్తున్నారు. ఆ నిధులతో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
సొంతంగా నిధుల సేకరణతో...
అందులో ఎంత మాత్రం తప్పు లేకపోయినా మిగిలిన ఎమ్మెల్యేలు అలా ఎందుకు చేయకూడదన్న ప్రశ్న ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో వినపడుతుంది. మిగిలిన ఎమ్మెల్యేలకు ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ నిధులపై తాను ఆధారపడనని పరోక్షంగా రఘురామకృష్ణరాజు చెప్పదలుచుకున్నారా? అన్న ప్రశ్న కూడా వినపడుతుంది. మరోవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి ఉండటం, ఉన్న నిధులు సంక్షేమ పధకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుండటంతో ఇక ప్రభుత్వంపై ఆధారపడి ప్రయోజనం లేదనకున్న రాజు గారు తన సొంతంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందనే లభిస్తుండటంతో ఉండి నియోజకవర్గం అభివృద్ధిని తాను సొంతంగానే చేస్తానని ప్రభుత్వానికి పరోక్షంగా సంకేతాలను పంపినట్లయిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
మరోవైపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పింఛన్లను పంపిణీ చేస్తూ ఇచ్చిన కరపత్రంపై ఎన్టీఆర్ ఫొటో లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే నెల పింఛను చెల్లించే సమయంలో ఎన్టీఆర్ ఫొటో పెట్టాలంటూ ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆ కరపత్రంపై కేవలం చంద్రబాబు ఫొటో మాత్రమే ఉండటంతో ఎన్టీఆర్ ఫొటో కూడా ముద్రించాలని పేర్కనడంతో రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారా? లేక కేవలం మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేశారా? అన్న విషయంపై ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
Next Story