Mon Dec 23 2024 05:26:19 GMT+0000 (Coordinated Universal Time)
మరో యువతితో పెళ్లి.. ప్రియుడిని కత్తిపీటతో నరికేసిన యువతి
ఈ విషయం తెలుసుకున్న డిబేరా తనవద్ద తీసుకున్న రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తిరిగి ఇచ్చేయాలని కోరింది.
ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదన్న అక్కసుతో ఓ యువతి ప్రియుడిని కత్తిపీటతో నరికి చంపింది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు (25) తాపీ మేస్త్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెలకవీధికి చెందిన కుర్లు డిబేరా అనే మహిళతో శేషుకి చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో నాగశేషు అవసరాల నిమిత్తం డిబేరా రూ.2 లక్షల నగదు, ఒక బంగారు గొలుసు ఇచ్చింది. వీరిద్దరి ప్రేమ విషయం నాగశేషు ఇంట్లో తెలియగా.. పెళ్లికి నిరాకరించారు. మరో యువతితో నాగశేషుకి వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న డిబేరా తనవద్ద తీసుకున్న రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తిరిగి ఇచ్చేయాలని కోరింది. ఎంతకూ అతను స్పందించకపోవడంతో కడతేర్చాలని భావించింది. తన స్నేహితుడైన శివన్నారాయణకు విషయం చెప్పి సహాయం కోరింది. బుధవారం (మే 10) తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో డిబేరా శివన్నారాయణ ద్విచక్రవాహనంపై నాగశేషు ఇంటికి వెళ్లింది. మేడపై నిద్రిస్తున్న అతడిని లేపి తన డబ్బులు ఇవ్వాలని అడిగింది.
ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీయడంతో.. డిబేరా తనవెంట తెచ్చుకున్న కత్తిపీటతో నాగశేషుపై దాడిచేసింది. అరుపులు విని పైకి వచ్చిన నాగశేషు తల్లి డిబేరాను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపై శివన్నారాయణ కర్రతో దాడి చేశాడు. నాగశేషుకి తీవ్రగాయాలు కావడంతో అతడిని గోకవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో నాగశేషు మరణించాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story