Mon Dec 23 2024 07:57:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీకి గుడ్ న్యూస్ ఇక రాష్ట్రంలోనే షూటింగ్లు.. రెడీ అయిపోతున్న నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వంలో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. జనసేన పార్టీకి సినిమాటోగ్రఫీ శాఖ లభించింది. ఆ శాఖను జనసేనకు చెందిన కందుల దుర్గేష్ చూస్తున్నారు. దీంతో పాటు స్వతహాగా చంద్రబాబు నాయుడు ఏపీలో టూరిజంతో పాటు సినిమా షూటింగ్ లను కూడా ప్రోత్సహిస్తారు. ఈ నేపథ్యంలో అన్నీ కలసి వచ్చినట్లుగా చిత్ర పరిశ్రమకు మంచి రోజులొచ్చాయన్నది ఫిలింనగర్ వర్గాల టాక్ గా వినపడుతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లు చేయడానికి ఎక్కువ మంది నిర్మాతలు రెడీ అయిపోతున్నారని కూడా పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఎక్కువ చేయాలని నిర్ణయించారు.
ఆదాయం వచ్చేది....
హైదరాబాద్ లో అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమకు 60 శాతానికి పైగా ఆదాయం వచ్చేది ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే. ఈ నేపథ్యంలో ఏపీని విస్మరించకూడదని సినీ పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసింది. సినిమాలో కొంత భాగం షూటింగ్ అయినా ఏపీలో నిర్వహించాలని నిర్మాతల మండలి కూడా దాదాపు డిసైడ్ అయినట్లు తెలిసింది. కేవలం నిర్మాతలు మాత్రమే కాదు.. దర్శకులు.. హీరోలు 24 క్రాఫ్ట్స్ లో ఏ విభాగం చూసినా ఎక్కువ మంది ఏపీకి చెందిన వారే ఉండటంతో ఏపీలో షూటింగ్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమా షూటింగ్ లు ఏపీలో ప్రారంభమయ్యాయి. రామ్చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ వంటి మూవీ చిత్రీకరణ కూడా కోనసీమ ప్రాంతంలో జరుగుతుంది.
రాయితీలు, ప్రోత్సాహకాలు...
దీంతో పాటు ఎక్కువ షూటింగ్ లు ఏపీలోనే నిర్వహించాలని నిర్మాతలు, దర్శకులు కూడా భావిస్తుండటంతో ప్రభుత్వం కూడా వారికి రాయితీలు ప్రకటించడానికి సిద్ధమయింది. మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలసినప్పుడు కూడా దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతోనే షూటింగ్ లు మరింత ఎక్కువయ్యాయన్న పేరు ను తేవడానికి కందుల దుర్గేష్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అందుకే చిరంజీవిని కలిసి షూటింగ్ లకు అనువైన వాతావరణం ఉందని, ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతుతో పాటు ప్రోత్సహకాలు కూడా అందిస్తామని చెప్పినట్లు తెలిసింది. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరోలను కూడా కలవాలని కందుల దుర్గేష్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది.
అన్నీ మన చేతుల్లోనే...
ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. చక్కటి షూటింగ్ స్పాట్ లున్నాయి. విశాఖ తీరంతో పాటు ఇటు మడ అడవులు, కోనసీమ ప్రాంతమే కాకుండా రాయలసీమలో కర్నూలు, చిత్తూరు జిల్లాలో హార్స్లీ హిల్స్, నెల్లూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు సినిమా షూటింగ్ లకు అనువైన ప్రదేశాలుగా గుర్తించి తొలుత వాటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో ఏపీ సర్కార్ ఉంది. ఇక విశాఖ నగరం అంటేనే ఇప్పటికీ అనేక మంది సినీహీరోలకు ఇష్టమైన ప్రదేశం. అక్కడ షూటింగ్ అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఎయిర్ కనెక్టివిటీ ఉండటంతో పాటు కేంద్రంలో విమానయాన శాఖ కూడా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు చేతిలో ఉండటంతో మరిన్ని సర్వీసులు వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారంటున్నారు. ఇక తిరుపతి, కర్నూలకు కూడా హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు వేయిస్తే అక్కడ కూడా షూటింగ్ లు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి. దీంతో పాటు ఈనెల 26న విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఏపీలో తెలుగుచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కోరింది. దీంతో ఇక ఏపీలో షూటింగ్ ల సంఖ్య పెరిగే అవకాశాలయితే పుష్కలంగా ఉన్నాయి.
Next Story