Fri Dec 27 2024 19:45:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో అడుగుపెడితే ఇక బాదుడే.. టోల్ ట్యాక్స్ కు రెడీ అవుతున్న సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రహదారులను నిర్మించేందుకు కొత్త దారులను వెతుకుతుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రహదారులను నిర్మించేందుకు కొత్త దారులను వెతుకుతుంది. అందులో భాగంగా ప్రయివేటు సంస్థలకు రోడ్ల నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు దాదాపు సిద్ధమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏపీలో రహదారుల నిర్మాణానికి పీపీపీ మోడల్ లో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు కింద తూర్పు గోదావరి జిల్లాలో రహదారుల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో పాటు రహదారులను మెరుగుపర్చాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
టోల్ ఫీజు వసూలు చేసి...
ఇప్పటికే రహదారులను మెరుగుపర్చేందుకు 840 కోట్ల రూపాయల వరకూ విడుదల చేశారు. ఈ నిధులతో మరమ్మత్తులు చేపడుతున్నారు. అయితే అనేక రహదారులు ఐదేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోలేక అద్వాన్నంగా తయారయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చే వారు సయితం రహదారుల దుస్థితిపై సోషల్ మీడియాలో ఫొటోలు, కామెంట్స్ పెట్టారు. ఒకరకంగా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఏపీలో అద్వాన్నమైన రహదారులు కూడా ఒక కారణమని చెప్పకతప్పదు. దీని నుంచి బయటపడాలంటే రహదారులను సంక్రాంతి నాటికి మెరుగుపర్చాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. రహదారులను నిర్మించిన సంస్థలే ఆ రహదారులపై టోల్ గేట్లు పెట్టి వాహనాల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసేలా నిబంధనలను రూపొందించనున్నారు.అయితే ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు టోల్ గేట్ల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి దశలో పద్దెనిమిది రహదారులు, రెండో దశలో 68 రహదారుల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది.
మొదటి దశలో...
ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ది చేసి వాటిపై టోల్ గేట్లు పెట్టేందుకు సిద్దమవుతోంది. దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇలా తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లూ అభివృద్ధి చేసి టోల్ వసూలు చేస్తారు. తొలి దశలో ప్రభుత్వం పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే 18 రోడ్లలో చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ మధ్య (130 కి.మీ), విజయనగరం-పాలకొండ మధ్య 72.55 కిలోమీటర్లు, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం మధ్య 113.40 కిలోమీటర్లు, భీమునిపట్నం-నర్సీపట్నం మధ్య 78.10 కిలోమీటర్లు, కాకినాడ-జొన్నాడ మధ్య 48.84 కిలోమీటర్లు, కాకినాడ-రాజమండ్రి కెనాల్ మధ్య 65.20 కిలోమీటర్లు, ఏలూరు-మేడిశెట్టివారి పాలెం మధ్య 70.93 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు.
రెండో దశలో...
అలాగే నరసాపురం-అశ్వారావుపేట మధ్య 100 కిలోమీటర్లు, ఏలూరు-జంగారెడ్డి గూడెం మధ్య 51.73 కిలోమీటర్లు, గుంటూరు-పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు, గుంటూరు-బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు, బేస్తవారిపేట-ఒంగోలు మధ్య 113.25 కిలోమీటర్లు, రాజంపేట-గూడూరు మధ్య 95 కిలోమీటర్లు, ప్యాపిలి-బనగానపల్లి మధ్య 54.44 కిలోమీటర్లు, దామాజీ పల్లి-నాయినపల్లి క్రాస్-తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు, జమ్మలమడుగు-కొలిమిగుండ్ల మధ్య 43 కిలోమీటర్లు, సోమందేపల్లి-హిందూపురం-తూముకుంట మధ్య 35.53 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. రెండో దశలో మరో 68 రహదారులను డెవలెప్ మెంట్ చేయనున్నారు. మరి ప్రజల నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందన్నది భవిష్యత్ లో తేలనుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిసింది.
Next Story