Thu Dec 19 2024 09:08:58 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ఈ ఘటనపై కృష్ణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హత్య చేసి, రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే..
విజయనగరం జిల్లా రాజాం కు చెందిన ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) దారుణహత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న కృష్ణను ఉద్దేశపూర్వకంగానే బొలెరో వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. హత్య చేసి, రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజాం సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం (జులై 15) ఉదయం కృష్ణ తన ఇంటి నుంచి బైక్ పై బయల్దేరి తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళ్తున్నారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద ప్రత్యర్థివర్గం బొలెరో వాహనంతో ఆయన్ను ఢీ కొట్టింది. దాంతో కృష్ణ అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనపై కృష్ణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హత్య చేసి, రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడంతో.. మృతుడి కుమారుడు శ్రావణ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్ధవోలుకు చెందిన మరడాన వెంకట నాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో హత్యగా నిర్థారణ కావడంతో.. పోలీసులు నేడు వెంకటనాయుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడి ఇంటివద్ద ఉద్దవోలు గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. అతని ఇంటిపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఉపాధ్యాయుడు కృష్ణను రాజకీయ కక్షతోనే హత్యచేశారని, వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్ధవోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. భారీగా పోలీసులు మోహరించారు. హత్యకు గురైన ఉపాధ్యాయుడు కృష్ణ తెర్లాం మండలం ఉద్దవోలు టీడీపీ సర్పంచిగా 1988 నుంచి 1995 వరకూ పనిచేశారు. 1998లో ఆయనకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో.. ఆయన ఎవరికి మద్దతు తెలిపితే వారే గ్రామానికి సర్పంచిగా గెలిచేవారు. ప్రస్తుతం సర్పంచిగా ఉన్న సునీత 2021లో ఆయన మద్దతుతోనే గెలిచింది. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీకి చెందిన వెంకటనాయుడు.. కృష్ణను హతమార్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Next Story