Mon Dec 23 2024 09:02:18 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. జులై నెలలో నోట్లు లెక్క పెట్టుకోవాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.
ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. జులై నెలలో ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఏడు వేల రూపాయలు పింఛను మొత్తాన్ని అందించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో పింఛను మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన నాలుగు వేల రూపాయలను జులై నెల నుంచి ఇస్తామని కూడా అనేక సభల్లో ఆయన చెప్పారు. అదే సమయంలో ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి నెలకు వెయ్యి రూపాయలు అదనంగా కలిపి జులై నెలలో ఏడు వేల రూపాయలు ప్రతి పింఛనుదారుడికి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఒకటో తేదీనే...
దీంతో పాటు ప్రతి నెల ఒకటోతేదీన ఖచ్చితంగా పింఛను ఇచ్చేలా తాము అధికారంలోకి వస్తే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం 69 లక్షల మంది వరకూ పెన్షనర్లున్నారు. వీరందరికీ జులై నెల పింఛను అందించాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. అవసరమైతే రుణాలు తీసుకునైనా జులై నెల పింఛను మొత్తాన్ని పెన్షన్ దారులకు ఏడు వేల రూపాయలు చొప్పున అందించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు.
ఎలా పంపిణీ చేయాలన్న దానిపై...
అయితే బ్యాంకుల ద్వారానే జులై నెల పింఛను కూడా డిపాజిట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే వాలంటీర్ల వ్యవస్థ సరిగా లేకపోవడంతో సచివాలయ సిబ్బంది ద్వారా లేకపోతే ఇతర మార్గాల ద్వారా ఇంటికి వెళ్లి పింఛను మొత్తాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రిగా ఇంకా బాధ్యతలను చేపట్టకపోయినా తన ప్రధమ ప్రాధాన్యత తొలుత జులై నెలలో ఒక్కొక్కరికీ ఏడు వేల రూపాయల పింఛను ఇచ్చి, తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. మిగిలిన హామీలకు డెడ్ లైన్ లేకపోయినా పింఛన్లకు మాత్రం తాము డెడ్ లైన్ పెట్టామని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. మొత్తం మీద జులై నెలలో పింఛను మొత్తం ఏడు వేల రూపాయలను ఒక్కొక్కరూ అందుకుంటారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమైన కసరత్తులు ప్రారంభమయ్యాయి.
Next Story