Tue Apr 08 2025 15:46:07 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Assembly : గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు

గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సమావేశాలకు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు పర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్థికంగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీసిందని తెలిపారు. గత ప్రభుత్వ తీరుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని గవర్నర్ అన్నారు.అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశామని గవర్నర్ అన్నారు.
సంక్షేమం... అభివృద్ధి...త
తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. అన్ని అంశాల్లో గత ప్రభుత్వం విఫలమయిందని గవర్నర్ తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అమరావతి, పోలవరం నిర్మాణాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళుతున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి దిశలో పయనించేలా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చామని తెలిపారు.
తలసరి ఆదాయాన్ని...
తలసరి ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచగలిగామని గవర్నర్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని గవర్నర్ తెలిపారు. పేదరికాన్ని తొలగించడమే ధ్యేయంగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. 200 అన్న క్యాంటిన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకే భోజనం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తను చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని చెప్పారు. పది సూత్రాలతో తాము ముందుకు వెళుతున్నామని గవర్నర్ చెప్పారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Next Story