జగన్ ఆస్తుల కేసులు.. ఎన్నికల లోపు పూర్తీ చేయాలంటూ!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇప్పటికే వైఎస్ జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదు. ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్ ను, జగన్ కేసులపై దాఖలైన పిల్ తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన కేసుల విచారణను ఎన్నికల లోపు పూర్తి చేయాలని హరిరామజోగయ్య తన పిటిషన్ లో కోరారు. ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని.. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ, డిశ్చార్జి పిటిషన్ల పెండింగ్ పై సీబీఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.