Wed Apr 02 2025 10:43:38 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కూటమి ప్రభుత్వంపై చేగొండి అసంతృప్తిగా ఉన్నారా? రీజన్ ఇదేనా?
కాపు సామాజికవర్గాల ప్రయోజనాల కోసం చేగొండి హరిరామ జోగయ్య ప్రయత్నం వృధాగానే కనపడుతుంది

కాపు సామాజికవర్గాల ప్రయోజనాల కోసం కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ప్రయత్నం వృధాగానే కనపడుతుంది. ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడాలని బలంగా కోరుకున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో ఉన్నా, కాపు సామాజికవర్గం నేతలను చైతన్య పర్చి పవన్ కల్యాణ్ కు మద్దతుగా గత ఎన్నికల్లో కాపులు మద్దతుగా నిలవడానికి కారణమయ్యారు. ఆయన ఇంటికే పరిమితమయినా హరిరామ జోగయ్యకు కాపు సామాజికవర్గంలో మంచి పేరుంది. కాపుల ప్రయోజనాల కోసం ఆయన పనిచేస్తారని ఆ సామాజికవర్గం ప్రజలు బలంగా నమ్ముతారు. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలోని కాపులు, బలిజలను ఏకం చేయడానికి జోగయ్య ఎంత ప్రయత్నించారన్నది పక్కన పెడితే కూటమి విజయానికి ఆయన ఒక చేయి వేశారని చెప్పక తప్పదు.
కొన్ని రోజుల పాటు...
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కొన్ని రోజుల పాటు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ కు, ప్రభుత్వానికి లేఖలు రాశారు. కాపుల రిజర్వేషన్ల అంశంపైన, సామాజికవర్గాలకు సంబంధించి వివిధ ప్రయోజనాలపైనా ఆయన లేఖలు రాశారు. గోదావరి జిల్లాల అభివృద్ధిని చేపట్టాలని ఒక లేఖలోనూ, నరసాపురం - కోటిపల్లి రైల్వే లైను ఏర్పాటు చేయాలని, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలను నెలకొల్పాలని, రాజమండ్రి ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా ఇవ్వాలంటూ పలు మార్లు చేగొండి హరిరామ జోగయ్య లేఖలు రాశారు. గోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజాన్ని కూడా డెవలెప్ చేయాలని కోరారు. దీంతో పాటు నరసాపురం నుంచి మచిలీపట్నం వరకూ కొత్త రైలు లైన్ నిర్మించాలని కూడా లేఖలో చేగొండి ప్రస్తావించారు.
అనేక డిమాండ్లతో...
గోదావరి నదులపై వంతెనలు చేపట్టాలని, గోదావరి జిల్లాల్లో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కూడా జోగయ్య పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం కోటాలో కాపులకు రిజర్వేషన్ కల్పించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు అమలు చేయకుండా అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వమైనా స్పందించి కాపులకు రిజర్వేషన్లు కల్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాజకీయ పరంగా కూడా అవకాశాలు మరింత మెరుగుపర్చాలని కోరారు.
రాసిన లేఖలకు...
కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖలకు ఎలాంటి స్పందన లేదు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన లేఖకు రెస్సాన్స్ ఇవ్వలేదు. దీంతో చేగొండి హరిరామ జోగయ్య ఇటీవల లేఖలు రాయడం మానుకున్నట్లే కనిపిస్తుంది. తాను ఎన్ని లేఖలు రాసినా కనీసం దానిపై స్పందించకపోవడంపై జోగయ్య తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఇటీవల కాలంలో జోగయ్య విసుగు చెంది లేఖలు రాయడం మానుకున్నట్లుంది. కూటమి ప్రభుత్వం కూడా కాపులకు పెద్దగా ప్రయోజనం చేయడం లేదని జోగయ్య తన అనుచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తం మీద జోగయ్య లేఖలను కూటమి పార్టీ నేతలు లైట్ గా తీసుకోవడంతో ఆయన కూడా రాయడం వృధా అని మానుకున్నట్లే కనపడుతుంది.
Next Story