Mon Dec 23 2024 18:32:26 GMT+0000 (Coordinated Universal Time)
మహానాడుపై భానుడి ప్రతాపం
టీడీపీ మహానాడు కార్యక్రమానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఎండల తీవ్రత తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఏర్పాటు చేసిన..
మహనాడుపై ఎండలు తీవ్రప్రతాపం చూపిస్తున్నాయి. రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఎండల తీవ్రత తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో 10 సంఖ్యలో కార్యకర్తలకు చికిత్స చేస్తున్నారు. కొందరికి సెలైన్లు కూడా ఎక్కిస్తున్నారు. రోహిణి కార్తె మొదలైనప్పటి నుంచి వేడిగాలులు, ఎండల తీవ్రత పెరిగింది. అడపా దడపా వర్షాలు కురిసినా.. అంతకంతా ఎండలు రెట్టింపవుతున్నాయి. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు.
రాజమండ్రి శివార్లలోని వేమగిరి వద్ద టీడీపీ మహానాడుకు భారీ ఏర్పాట్లు చేసింది. నేడు పార్టీ ప్లీనరీ సమావేశం జరుగుతుండగా.. సుమారు 15 వేల మంది హాజరైనట్లు తెలుస్తోంది. రేపు 10 లక్షల మంది ప్రజలు మహానాడు సభకు హాజరవుతారని అంచనా. ఈ నేపథ్యంలో 1700 మంది పోలీసులు మహానాడు వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ ను మళ్లించారు. కాగా.. మహానాడులో పసందైన గోదావరి, కోస్తాంధ్ర విందులు ఏర్పాటు చేశారు. 1500 మంది వంటవాళ్లతో.. 200 రకాల వంటకాలను సిద్ధం చేయించారు. వాటిలో ఫేమస్ కాకినాడ కాజా, గోదావరి కూరగాయల ఆవకాయలు, నోరూరించే వెజ్ రుచులెన్నో ఉన్నాయి.
Next Story