Sat Nov 23 2024 04:41:50 GMT+0000 (Coordinated Universal Time)
మరో అల్పపీడనం.. ఏపీని వీడని వరుణుడు.. 18 నుండి వర్షాలు
నవంబర్ 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో 18 నుండి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ ను వరుణుడు వీడట్లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అటు తమిళనాడుతో పాటు.. ఇటు రాయలసీమ జిల్లాల్లోను జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ రోజు కాస్త వాతావరణం పొడిగా ఉంది.. ఇక వర్షాలు లేనట్టే అనుకునే లోపే.. మరోసారి వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13న ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమై ఉంది.
నవంబర్ 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో 18 నుండి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండ్రోజుల్లో దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి వరద నీరు చేరింది.
Next Story