Sun Dec 22 2024 23:41:07 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముక్తేశ్వరం, కోటిపల్లి, సఖినేటిపల్లి..
ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యదిశగా ఒడిశా తీరం వెంబడి నిదానంగా పయనిస్తుందని తెలిపింది. ఇదే సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని ఐఎండీ వివరించింది. వీటి ప్రభావంతో.. రాగల 5 రోజుల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగతా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది.
కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముక్తేశ్వరం, కోటిపల్లి, సఖినేటిపల్లి, నరసాపురంలో ప్రజలు పంటు ప్రయాణాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే లంక గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరానికి గోదావరి ప్రవాహం పెరుగుతుందని తెలిపారు. నీటినిల్వ 5 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు. అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. సహాయం కావలసిన వారు 1070, 1800 425 0101 నంబర్లను సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
తెలంగాణలో మరో నాలుగు రోజులు (జులై24 వరకు) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నేటి రాత్రి రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్ సహా.. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉండటంతో గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భారీవర్షాలు, వరద పరిస్థితులపై సీఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయన్న సూచన ఉందని శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ లో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని 40 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మోహరించినట్టు వివరించారు. ములుగు, వరంగల్, కొత్తగూడెం ప్రాంతాల్లోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి వరదనీరు వస్తోందని, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని వెల్లడించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిమట్టాన్ని నిశితంగా గమనిస్తున్నామని సీఎస్ వివరించారు. తెలంగాణలోని ప్రాజెక్టుల్లో ఇప్పటికి సగం నీరే ఉందని, ఇప్పటికిప్పుడు వాటికి వరద పోటెత్తినా ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.
Next Story