Tue Nov 05 2024 15:25:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో జోరువానలు
సోమవారం కోనసీమతో పాటు ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ..
ఏపీలోకి నైరుతి వచ్చి వర్షాలు పడుతున్నాయని రైతులు మురిసేలోపే.. మళ్లీ ఎండలు ఊపందుకున్నాయి. శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో వేడిగాలులు వీచాయి. అలాగే ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ చల్లటి వార్త చెప్పింది. సోమవారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించింది.
సోమవారం కోనసీమతో పాటు ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చెదురు మదురు జల్లులు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్లకింద, పొలాల్లోను ఉండరాదని హెచ్చరించింది.
Next Story