Sun Dec 22 2024 23:31:24 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజులు భారీవర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ ఆవర్తనం రాగల 2 నుండి 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిస్సా, పరిసరాలలోని గంగటిక్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్
రానున్న మూడురోజుల్లో ఏపీ, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు, బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో.. నేటి నుంచి మూడురోజులు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద 5.8కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఆవర్తనం బలహీన పడిందని తెలిపారు. శనివారం వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిస్సా – గంగటిక్ పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్రమట్టం నుండి 5.8కిలోమీటర్ల ఎత్తువరకు ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుగా వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ఆవర్తనం రాగల 2 నుండి 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిస్సా, పరిసరాలలోని గంగటిక్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. రేపు, ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడా చిరుజల్లులు పడతాయని పేర్కొంది. ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకూ భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలకు మోస్తరు వర్షసూచన చేసింది. అలాగే.. 17,18 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అది క్రమంగా అల్పపీడనం, వాయుగుండంగా రూపాంతరం చెందవచ్చని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
Next Story