Tue Nov 05 2024 16:32:32 GMT+0000 (Coordinated Universal Time)
రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి..
ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తరకోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు , దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. జులై 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ పేర్కొంది. వరుస అల్పపీడనాల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.
మరోవైపు తెలంగాణలోని 4 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. నిన్నంతా నగరంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అపార్టుమెంట్ల వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు, రేపు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరికి పోటెత్తడంతో.. నిన్న మధ్యాహ్నం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Next Story