Sun Dec 22 2024 23:45:31 GMT+0000 (Coordinated Universal Time)
నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. మరో వారంరోజులు ?
ఏపీ విషయానికొస్తే.. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాజమండ్రిలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తెతో పెరిగిన ఉష్ణోగ్రతలు.. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న బిపోర్ జాయ్ తుపాను ప్రభావంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు పిల్లలు, పెద్దలు అంతా బెంబేలెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. రాత్రివేళల్లోనూ వాతావరణం వేడిగా ఉంటూ.. విపరీతమైన ఉక్కపోతకు గురిచేస్తోంది.
శుక్రవారం తెలుగురాష్ట్రాల్లోని కొన్నిప్రాంతాలు అగ్నిగోళాన్ని తలపించాయి. కొన్నిప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. తెలంగాణలోని 13 జిల్లాల్లో 47 మండలాల్లో వడగాలులతో జనం అల్లాడిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, మణుగూరు, ఖమ్మంజిల్లాలో సింగరేణి, వేంసూరు మండలాల్లో తీవ్రమైన వడగాలులు విచాయి. సాధారణం కంటే 6.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 10 మండలాల్లో శుక్రవారం 45-46.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీ విషయానికొస్తే.. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాజమండ్రిలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లిలో 44.9 డిగ్రీలు, విజయవాడలో 44.3 డిగ్రీలు, అగిరిపల్లిలో 44.2, వత్సవాయిలో 44, అమరావతిలో 44, రామచంద్రాపురం, కిర్లంపూడి, జగ్గయ్యపేటలో 43.9, మచిలీపట్నంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు కూడా ఏపీ, తెలంగాణల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పగలు అధికఉష్ణోగ్రతలు ఉన్నా.. రాత్రి వేళలో కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో వారంరోజుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జూన్ 17 నాటికి రుతుపవనాలు ఏపీలోకి వస్తాయని తెలిపింది.
Next Story